కరిగిపోతున్న కాలం..! | - | Sakshi
Sakshi News home page

కరిగిపోతున్న కాలం..!

Sep 11 2026 8:04 AM | Updated on Sep 11 2026 8:04 AM

కరిగిపోతున్న కాలం..!

వీరఘట్టం: ఈమె పేరు సీరాపు లిఖిత..వీరఘట్టానికి చెందిన ఈమెకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమెకు ఐదేళ్ల బాబు ఉన్నాడు. నాలుగు నెలల క్రితం భర్త అనార్యోగ్యంతో మృతి చెందాడు. వితంతు పింఛన్‌ కోసం ఇటీవల వీరఘట్టం సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసింది.అయితే ఆ దరఖాస్తును స్వీకరించడం లేదు. ఎందుకని ఆరా తీస్తే హౌస్‌ హోల్డింగ్‌లో ఆమె పుట్టింటిలో ఈమె పేరును జత చేశారు. ఈ హౌస్‌ హోల్డ్‌లో ఉన్న వాళ్ల నాన్నమ్మకు వృద్ధాప్యపు పింఛన్‌ వస్తోంది. వీరు వేర్వేరుగా నివసిస్తున్నప్పటికీ, వేర్వేరుగా రేషన్‌కార్డులు ఉన్నప్పటికీ వారంతా ఒకే హౌస్‌ హోల్డ్‌లో ఉండడంతో ఆమెకు పింఛన్‌ పెట్టేందుకు దరఖాస్తును కంప్యూటర్‌ స్వీకరించడం లేదని అధికారులు చెబుతున్నారు. వింతంతు పింఛన్‌కు ఈమెకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ దరఖాస్తు కూడా పెట్టలేని పరిస్థితి. ఇలా ఈమె ఒక్కరు మాత్రమే కాదు. ఇటువంటి వారు చాలా మంది హౌస్‌ హోల్డ్‌ మ్యాపింగ్‌ల వల్ల పింఛన్‌ దరఖాస్తులు పెట్టలేకపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటుతున్నా ఇంతవరకు ఒక్క కొత్త పింఛన్‌ కూడా ఇవ్వలేదు. మరో నెల రోజుల తర్వాత స్థానిక ఎన్నికలు జరగనుండడంతో ఒక్కసారిగా వృద్ధులు, వింతతువులు, దివ్యాంగులపై ప్రేమ కురిపిస్తూ ఈనెల 7 నుంచి 16 వరకు కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రకటన చేశారు. కేవలం తొమ్మిది రోజుల్లో లక్షకు పైగా ఉన్న అర్హులు పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడం సాధ్యపడడం లేదు.ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సచివాలయాల వద్ద పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఆపసోపాలు పడుతున్నారు.

హౌస్‌హోల్డ్‌ మ్యాపింగ్‌ కష్టాలు..

ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఇంటింటికీ పర్యటించిన అధికారులు ప్రతి ఇంటిలో ఎంత మంది ఉన్నారో తెలుసుకుని వారందరి ఆధార్‌కార్డు నంబర్లను ఓకే హౌస్‌ హోల్డింగ్‌లో మ్యాపింగ్‌ చేశారు. తర్వాత కొంత మందికి పెళ్‌లై అత్తవారింటికీ వెళ్లిపోయినా ఇంకా పాత హౌస్‌ హోల్డింగ్‌లోనే ఉన్నట్లు చూపిస్తోంది. అటువంటి దరఖాస్తులను అధికారులు స్వీకరించలేకపోతున్నారు. దీంతో పింఛన్లు పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ దరఖాస్తు చేసుకోలేక అర్హులైన వారంతా కార్యాలయాల చుట్టూ కాళ్ల చెప్పులు అరిగేలా తిరుగుతూనే ఉన్నారు.

సర్వర్‌ ప్రోబ్లం..

వీరఘట్టం మేజర్‌ పంచాయతీలో నాలుగు సచివాలయాలు ఉన్నాయి. ఉదయం 10 గంటల నుంచి పింఛన్‌దారుల దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే ఒక్కొక్క దరఖాస్తు పరిశీలించి వారి ధ్రువీకరణ పత్రాలను స్కానింగ్‌ చేసి అప్‌లోడ్‌ చేసేందుకు ఒక్కో దరఖాస్తుకు అరగంట సమయం పడుతోంది. దీంతో రోజుకు ఒక సచివాయలంలో 12 నుంచి 16 కంటే ఎక్కువ రఖాస్తులు అప్‌లోడ్‌ చేయలేకపోతున్నారు. ప్రస్తుతం జిల్లాలో గురువారం నాటికి 350 సచివాలయాల్లో సుమారు 16 వేల దరఖాస్తులు అప్‌లోడ్‌ అప్‌ అయి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

దరఖాస్తు గడువు పెంచాలి..

పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 7 నుంచి 16 వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఇప్పటికి నాలుగు రోజులు గడిచిపోయాయి.ఇంకా దరఖాస్తు కు ఆరు రోజులు మాత్రమే సమయం ఉంది.ఇందులో ఈనెల 12న రెండవ శనివారం,13న ఆదివారం,14న వినాయక చవితి వరుసగా మూడు రోజులు సెలవు దినాలు కావడంతో దరఖాస్తు చేసుకునేందు కు ఇంకా మూడు రోజులు మాత్రమే ఉంటుంది. ఈ సమయం సరిపోనందున పింఛన్లకు దరఖాస్తు చేసుకునే గడువు పెంచాలని అర్హులైనవారు కోరుతున్నారు.

మరో ఆరురోజులే గడువు

అందులో మూడు రోజులు సెలవులు

అర్హులకు పెన్షన్‌ టెన్షన్‌

దరఖాస్తు చేసుకునేందుకు ఆపసోపాలు

వెంటాడుతున్న హౌస్‌ హోల్డ్‌ మ్యాపింగ్‌ కష్టాలు

జిల్లాలో పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న సుమారు 1 లక్షమంది

మరో వైపు మొరాయిస్తున్న సర్వర్లు

సమయం పెంచాలని వేడుకుంటున్న

పింఛన్‌ దరఖాస్తు దారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement