పాలకొండ: ఒక్క వాహనం పోయిందని వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేయగా ఐదు ద్విచక్రవాహనాల దొంగతనం గుట్టు రట్టయింది. నిత్యం వాహనాలు పోతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు చిన్న ఆధారంతో దర్యాప్తు చేసి వాహనాల దొంగలను అదుపులోకి తీసుకున్నారు. వాహనాలు దొంగలించి వాటిని అమ్మి ఆ సొమ్ముతో జల్సా చేస్తున్న వీరఘట్టం పట్టణానికి చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించి డీఎస్పీ ఎం.రాంబాబు గురువారం స్థానిక డీఎస్పీ కార్యాలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు వీరఘట్టం మండలం కంబరవలస వెటర్నరీ అసిసెంట్ పశువుల ఆస్పత్రి వద్ద తన ద్విచక్రవాహనం పార్కింగ్ చేసి విధులు నిర్వహిస్తున్న సమయంలో తన వాహనం చోరీ జరిగిందని ఈ నెల 1న వీరఘట్టం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన ఎస్సై దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా గురువారం వీరఘట్టం–పార్వతీపురం రహదారిలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి ద్విచక్రవాహనం వెనక్కి తిప్పి పారిపోయేందుకు ప్రయత్నించారు. అది గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరఘట్టం బీసీ కాలనీకి చెందిన పొందూరు మురళీకృష్ణ, చేతల చంద్రమౌళిలుగా గుర్తించి వారిని పోలీసు స్టేషన్‌కు తరలించి విచారణ చేశారు. ఈ విచారణలో పట్టుబడిన వాహనం చోరీ చేసినదే అని గుర్తించారు. నిందితులను తమ దైన శైలిలో విచారణ చేయడంతో ఈ వాహనంతో పాటు మరో నాలుగు పల్సర్ ద్విచక్రవాహనాలు దొంగతనం చేసినట్లు నిందితులు అంగీకరించారు. వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి కేసును త్వరగా ఛేదించిన వీరఘట్టం ఎస్సై ఎస్ షణ్ముఖరావు, సిబ్బందిని డీఎస్పీ అబినందించారు. సమావేశంలో సీఐ ఎ ప్రసాద్, పోలీసు సిబ్బంది ఉన్నారు.
ఐదు బైక్‌లు స్వాధీనం


