బొబ్బిలిరూరల్: ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాలకు అనుసంధానంగా ఉన్న అంతరరాష్ట్ర రహదారిపై పారాది వద్ద వేగావతి నదిపై నిర్మించిన నూతన వంతెన పనులు పూర్తికావచ్చాయి. ఈ నేపథంలో సోమవారం వంతెనపై వాహనాల ట్రయల్ రన్‌ను బుడా చైర్మన్, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు జెండా ఊపి ప్రారంభించారు. బ్రిటిష్ కాలం నాటి పాత బ్రిడ్జి ఓ వైపు ఒరిగిపోయి మరమ్మతులకు గురికావడంతో కొత్త వంతెన నిర్మాణానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.10.90 కోట్ల నిధులు, పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, అప్పటి బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు నూతన వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నదిపై కాజ్‌వే నిర్మించి వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. ఇంతలో ప్రభుత్వం మారడంతో పనుల్లో జాప్యం జరిగింది. రెండేళ్లలో అదనంగా సుమారు రూ.7కోట్ల ప్రజాధనం వెచ్చించి రూ.17.83 కోట్లతో పనులు పూర్తిచేసింది. వంతెన పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు మరో 10 రోజుల సమయం పడుతుందని కాంట్రాక్టర్ తెలిపారు. మంచిరోజులు లేవంటూ సోమవారం బ్రిడ్జిపై ట్రయల్ రన్ ప్రారంభించారు


