ఇవేం పరీక్షలు బాబోయ్‌.. | - | Sakshi
Sakshi News home page

ఇవేం పరీక్షలు బాబోయ్‌..

Aug 15 2026 2:21 AM | Updated on Aug 15 2026 2:21 AM

ఇవేం పరీక్షలు బాబోయ్‌..

రామభద్రపురం: ఈ నెల 17వ తేదీ నుంచి ప్రస్తుత విద్యాసంవత్సరం ఫార్మేటివ్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీంతో బాబోయ్‌ పరీక్షల కష్టాలు వచ్చి పడ్డాయ్‌ అంటూ ఉపాధ్యాయులు బెంబేలెత్తిపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలతో విద్యావ్యవస్థను అస్తవ్యస్తంగా మార్చిందని విమర్శలు వెల్లువెత్తున్నాయి. తాజాగా ఫార్మేటివ్‌, సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలను బుక్‌లెట్‌ విధానంలో నిర్వహించనుండడంతో అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయులకు ఇబ్బందులు తప్పవు. ప్రాథమిక విద్యలో ఇప్పుడిప్పుడే అక్షరాలు నేర్చుకుంటున్న చిన్నారులకు సైతం బుక్‌లెట్‌ ఇవ్వడంపై ఉపాధ్యాయ సంఘాలు విస్తుపోతున్నాయి. జిల్లాలో 1766 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వీటిలో సుమారు 1.10 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థి అభ్యసనా సామర్థ్యం మదింపు కోసం ఏటా నాలుగు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌, రెండు సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలు నిర్వహిస్తారు. అయితే మొదటి పరీక్ష జూన్‌, జూలై సిలబస్‌కు సంబంధించి విద్యార్థుల సామర్థ్యాలపై ఈ నెల 17 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ఈ పరీక్షలను మూల్యంకన అసెస్‌మెంట్‌ పుస్తకంలో రాయించి, మార్కులను ఆన్‌లైన్‌ చేయించాలి. ఇదిలా ఉంటే ప్రశ్నలు పాఠ్యాంశాలలో ఉన్న అంశాల నుంచే కాకుండా, బయట నుంచి విద్యార్థి స్థాయిని మించిన అంశాలు ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రాథమిక స్థాయిలో అక్షరాలే సరిగా రాయలేని పిల్లలకు ప్రశ్నపత్రాలు ఇచ్చి బుక్‌లెట్‌లో రాయమంటే ఎలా అని విద్యావంతులు మండిపడుతున్నారు.

టీచర్లపై అదనపు భారం..

విద్యాశాఖ ప్రతి ఏడాదీ సర్కారు బడుల్లో విద్యార్థులకు నిర్వహించే త్రైమాసిక, అర్ధ, వార్షిక పరీక్షలను ఎఫ్‌ఏ 1,2,3,4.. ఎస్‌ఏ 1,2 లుగా నిర్వహిస్తారు. ఈ పరీక్షలను మూల్యాంకనం పుస్తకాల్లో రాసేందుకు వీలుగా 1,2 తరగతులకు మూడు పుస్తకాలు.. 3,4,5 తరగతులకు నాలుగు పుస్తకాలు.. 6,7 తరగతులకు ఆరు పుస్తకాలు.. 8,9,10 తరగతులకు 7 పుస్తకాలు చొప్పున అందజేస్తున్నారు. ఏడాదిలో జరిగే అన్ని పరీక్షల వివరాలను ఈ మూల్యంకన పుస్తకంలో నమోదు చేసేందుకు ఏడాదంతా ఈ పుస్తకాన్ని టీచర్లు భద్రంగా ఉంచాలి. అయితే గతంలో పరీక్షలు విద్యార్థులు తెల్లకాగితాలపై రాస్తే ఉపాధ్యాయులు ఇంటికి తీసుకెళ్లి మూల్యాంకనం చేసేవారు. తర్వాత మార్కుల నమోదుతో ప్రక్రియ పూర్తయ్యేది. ప్రస్తుతం బుక్‌లెట్‌లో రాస్తుండడంతో వీటని ఇంటికి తీసుకెళ్లలేని పరిస్థితి. తప్పనిసరిగా పాఠశాలల్లోనే దిద్దాల్సి ఉంటుంది. దీంతో తరగతి గదిలో సమయం అంతా వృథా అవుతుండడంతో సిలబస్‌ పూర్తి చేయలేని పరిస్థితులు నెలకొంటాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఒకే బుక్‌లెట్‌లో పరీక్షలు రాయాల్సి రావడంతో త్రైమాసిక పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు.. అర్ధ సంవత్సరం పరీక్షల్లో కూడా ఇస్తే విద్యార్థులు గతంలో తాము రాసిన సమాధానాలనే తిరిగి చూసి రాసుకునే అవకాశం ఉంటుంది.

ఈ నెల 17 నుంచి ఫార్మేటివ్‌

అసెస్‌మెంట్‌ పరీక్షలు ప్రారంభం

బుక్‌లెట్‌ విధానంతో అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయులకు ఇబ్బందులే

పాత విధానమే మేలంటున్న

ఉపాధ్యాయులు

విద్యార్థులకు ఉపయోగమే..

సమగ్ర మూల్యాంకనం పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తున్నాం. మూల్యాంకన పుస్తకంలో జవాబులు రాయడం వల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగం. ఒక విద్యార్థికి సంబంధించి అన్ని సబ్జెక్టుల మార్కులతో పాటు విద్యార్థి వివరాలన్నీ మూల్యాంకన పుస్తకంలో నమోదు చేసేలా ఉన్నత విద్యాశాఖ అసెస్‌మెంట్‌ బుక్‌లెట్‌ డిజైన్‌ చేసింది. టీచర్లు భారం అంటే ఎలా అవుతుంది. విద్యార్థి సౌలభ్యం కోసం కొంత కష్టపడాల్సిందే.

– ఎ. తిరుమలప్రసాద్‌,

ఎంఈఓ, రామభద్రపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement