జి.అగ్రహారంలో మాంగనీసు దొంగలు | - | Sakshi
Sakshi News home page

జి.అగ్రహారంలో మాంగనీసు దొంగలు

Aug 15 2026 2:21 AM | Updated on Aug 15 2026 2:21 AM

చీపురుపల్లి:

అందరూ నిద్రపోయేవేళ చీపురుపల్లి మేజర్‌ పంచాయతీ పరిధిలోని జి.అగ్రహారం గ్రామ పొలిమేరలో దొంగలు పడ్డారు. జేసీబీలతో వచ్చి మాంగనీసు తవ్వకాలకు ఉపక్రమించారు. ఒకే సారి రూ.లక్షల సొమ్ము జేబులో వేసుకునేందుకు సిద్ధపడ్డారు. చకచకా తవ్వకాలు చేపట్టి ఏడు లారీల్లో మాంగనీసు ఖనిజాన్ని తరలించారు. అయితే, గ్రామస్తులు మేల్కొని తవ్వకాలను అడ్డుకోవడం, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అధికార బలం ఉన్న బడా దొంగలు తోకముడిచి పరారయ్యారు.

పక్కా స్కెచ్‌తో...

చీపురుపల్లి మేజర్‌ పంచాయతీ పరిధిలోని జి.అగ్రహారం పరిసరాల్లో డంపింగ్‌ యార్డు ఉంది. మేజర్‌ పంచాయతీ నుంచి వచ్చే వ్యర్థాలు అక్కడే పారబోస్తారు. అదే డంపింగ్‌ యార్డు కిందన మాంగనీసు గనులు ఉన్నాయని తెలుసుకున్న బడా దొంగలు వాటిని కొల్లగొట్టేందుకు స్కెచ్‌ వేశారు. దీంతో గురువారం అర్థరాత్రి జేసీబీ, యంత్రాలతో పాటు ఏడు లారీలు ఏర్పాటు చేసి మాంగనీసు అక్రమ తవ్వకాలు ప్రారంభించారు. దాదాపు ఏడు లారీల్లో మాంగనీసు అక్రమ రవాణా జరిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అర్థరాత్రి సమయంలోనే అక్కడకు వెళ్లి మాంగనీసు అక్రమ తవ్వకాలు అడ్డుకున్నారు. అంతేకాకుండా పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసు సిబ్బంది వెళ్లడంతో బడా దొంగలు వాహనాలతో పాటు పరారయ్యారు. ఇదే విషయంపై ఎస్‌ఐ ఉమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మాంగనీసు అక్రమ తవ్వకాలపై అందిన సమాచారం మేరకు సిబ్బందిని పంపించామన్నారు. అప్పటికే ఖాళీ వాహనాలు అటువైపుగా వెళ్తున్నాయని, వారిని తమ సిబ్బంది విచారించగా కిరాయికి వెళ్లి వస్తున్నట్లు చెప్పారని, అందులో ఎలాంటి మాంగనీసు లేదని స్పష్టం చేశారు.

జేసీబీతో

తవ్వకాలు

అర్థరాత్రి వేళ జేసీబీలతో అక్రమ తవ్వకాలు

ఏడు లారీలతో తరలింపు

స్థానికుల సమాచారం మేరకు పోలీసుల రాకతో పరార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement