ఒడిశాలో చంపి.. ఆంధ్రాలో పాతిపెట్టి.. | - | Sakshi
Sakshi News home page

ఒడిశాలో చంపి.. ఆంధ్రాలో పాతిపెట్టి..

Aug 15 2026 2:21 AM | Updated on Aug 15 2026 2:21 AM

ఒడిశాలో చంపి.. ఆంధ్రాలో పాతిపెట్టి..

గజపతినగరం రూరల్‌: ప్రేమ పేరుతో సహజీవనం సాగించిన యువతిని హతమార్చి, మృతదేహాన్ని మండలంలోని మరుపల్లి గ్రామ సమీపంలో గల మామిడి తోటలో పాతిపెట్టిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒడిశాలో నమోదైన హత్య కేసు దర్యాప్తులో భాగంగా మరుపల్లి సమీపంలోని మామిడి తోటలో పాతిపెట్టిన యువతి మృతదేహాన్ని శుక్రవారం పోలీసులు వెలికితీశారు. ఈ కేసుకి సంబంధించి గజపతినగరం ఎస్సై కె. కిరణ్‌కుమార్‌నాయుడు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం సిమ్లిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో హత్య కేసు నమోదు కాగా.. కేసు దర్యాప్తులో భాగంగా అక్కడి పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ అజిత ఆధ్వర్యంలో సిబ్బంది గజపతినగరం పోలీసులను ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఒడిశాలో నమోదైన హత్య కేసు వివరాలను స్థానిక పోలీసులకు వివరించారు. నిందితుడు మోహన్‌ కిల్లా ఇచ్చిన సమాచారంతో ఒడిశా, గజపతినగరం పోలీసులు సంయుక్తంగా మండలంలోని మరుపల్లి సమీపంలోగల మామిడి తోటలో మృతదేహాన్ని పాతిపెట్టిన స్థలాన్ని గుర్తించారు. గజపతినగరం తహసీల్దార్‌, పోలీసులతో పాటు ఒడిశా నుంచి వచ్చిన పోలీస్‌ అధికారులు, ప్రాంతీయ ఫోరెన్సిక్‌ అధికారులు, మృతురాలి కుటుంబ సభ్యుల సమక్షంలో మృతదేహాన్ని బయటకు తీశారు.

రెండేళ్లుగా సహజీవనం..

పోలీసుల వివరాల ప్రకారం..ఒడిశా రాష్ట్రం కోరాపుట్‌ జిల్లా దశవంతుపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని డంబో – తునకల్‌ గ్రామానికి చెందిన అల్బీన గరుడ (22) రెండేళ్లుగా సునాబెడాకు చెందిన మోహన్‌ కిల్లాతో సహజీవనం సాగించింది. ఈ క్రమంలో జూలై 28న ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన మోహన్‌ కిల్లా ప్రియురాలు అల్బీనాను హత్య చేశాడు. మరుచటి రోజు మృతదేహాన్ని గజపతినగరం మండలం మరుపల్లి సమీపంలోని మామిడి తోటకు తీసుకొచ్చి పాతిపెట్టాడు.

ప్రియురాలిని చంపిన ప్రియుడు

ప్రియుడి దొంగ నాటకం..

హత్య అనంతరం మోహన్‌ కిల్లా సునాబేడకు వెళ్లి, ఆగస్టు 1న అల్బీన గరుడ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అల్బీన తండ్రి బెనూధర్‌ గరుడకు..మోహన్‌ కిల్లాపై అనుమానం రావడంతో అతడే తన కుమారైను హత్యచేసి ఉంటాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మోహన్‌ కిల్లాను అదుపులోకి తీసుకుని విచారించగా, హత్య చేసినట్లు ఒడిశా పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించాడు. ఒడిశా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement