విజయనగరం క్రైమ్: సాహితీ స్రవంతి సభ్యుడు రావుపల్లి వాసుదేవరావుకు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం లభించింది. ఆయన రచించిన బాలగేయాలను మహారాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ధృవీకరించి, ఆ రాష్ట్రంలోని మూడు, నాలుగో తరగతి తెలుగు పాఠ్యపుస్తకాలలో ప్రచురించింది. పూసపాటిరేగ మండలం తిప్పలవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా పనిచేస్తున్న రావిపల్లి వాసుదేవరావు, సాహిత్యంపై ఉన్న మక్కువతో ఇప్పటివరకు 250కి పైగా బాల గేయాలు, 40కి పైగా కథలు రాశారు. ఆయన సాహిత్య కృషికి గుర్తింపుగా 2024 సంవత్సరానికి గాను విజయనగరం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును కూడా అందుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో తన గేయాలు ప్రచురితం కావడంపై వాసుదేవరావు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి చీకటి దివాకర్, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జీవీఎస్ జయపాలరావు, ప్రధాన కార్యదర్శి పాయల మురళీకృష్ణ, కె. శ్రీనివాసరావు, చీకటి చంద్రికరాణి రచయిత వాసుదేవరావుకు అభినందనలు తెలియజేశారు.


