గుమ్మలక్ష్మీపురం: జాతీయ స్థాయి అథ్లెటిక్ పోటీలకు గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థినులు బిడ్డిక స్పందన, ఆరిక దివ్య, చోడిపల్లి ప్రశాంతి ఎంపికై నట్లు పీడీ పత్తిక చంద్రమోహన్, కోచ్ ఆరిక జోగులు తెలిపారు. ఈ మేరకు విద్యార్థినులను శుక్రవారం ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఈనెల 11, 12, 13వ తేదీల్లో తిరుపతిలోని ఎస్‌వీ యూనివర్సిటీ స్టేడియంలో (తారకరామ) జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీల్లో తమ కళాశాలకు చెందిన విద్యార్థినులు పాల్గొన్నారన్నారు. అండర్ – 20 విభాగంలో 800 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందెంలో బిడ్డిక స్పందన ఉత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించిందని తెలిపారు. అలాగే అండర్ – 18 విభాగం హెప్టాథ్లాన్ పోటీల్లో పాల్గొన్న ఆరిక దివ్య కూడా గోల్డ్ మెడల్‌ను కై వశం చేసుకుందన్నారు. అండర్ – 20 విభాగం లాంగ్‌జంప్‌లో పాల్గొన్న చోడిపల్లి ప్రశాంతి బ్రాంజ్ మెడల్ సాధించి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 6 వరకు పుదుచ్చేరిలో జరగనున్న జాతీయ స్థాయి అథ్లెటిక్ పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు.


