విజయనగరం అర్బన్: రానున్న పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవంలో అందరి సమన్వయంతో ప్రజలకు మరిన్ని మెరుగైన సౌకర్యాలను అందించి నగరపాలక సంస్థకు మంచిపేరు తీసుకురావాలని మున్సిపల్ కమిషనర్ బాలస్వామి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఆయన తన చాంబర్‌లో అన్ని విభాగాల అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. గత సంవత్సరంలో జరిగిన చిన్న చిన్న లోటుపాట్లు పునరావృత్తం కాకుండా తగు జాగ్రత్తలు వహిచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. గతంలో అమ్మవారి జాతర నిర్వహణ తీరు, నగరపాలక సంస్థ తరఫున చేపట్టిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జాతర ఏర్పాట్లపై ఇప్పటి నుంచే ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. నగరంలోని అన్ని వీధుల్లో కాలువల పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ గతం కంటే మరింత మెరుగ్గా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్న ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నగరంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ఈ నెల 14వ తేదీన ఒకే రోజు వెయ్యి మొక్కలు నాటేలా బృహత్తర హరిత కార్యక్రమాన్ని చేపట్టాలని ఇందుకు సంబంధించి తగిన ఏర్పాట్లు చేయాలని ఉద్యాన శాఖ అధికారి పీవీసంతోష్‌కుమార్‌ను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో ఈఈ ప్రసాద్, ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొందపల్లి సాంబమూర్తి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ రమణమూర్తి, రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, డీఈ శ్రీనివాసరావు, టీపీఎస్ అనిత, వివిధ విభాగాల ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కమిషనర్ బాలస్వామి


