పార్వతీపురం రూరల్: రాఖీ పౌర్ణమి (ఆగస్టు 28) సందర్భంగా విదేశాల్లోని తోబుట్టువులు, బంధుమిత్రులకు రాఖీలు, కానుకలను సురక్షితంగా చేరవేసేందుకు ’‘ఇండియా పోస్ట్’ అంతర్జాతీయ పార్సిల్, స్పీడ్ పోస్ట్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు అన్ని ప్రధాన, ఉప, గ్రామీణ తపాలా కార్యాలయాల్లో ప్రత్యేక రాఖీ కవర్లను సిద్ధం చేసినట్లు పార్వతీపురం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి. బాబురావు తెలిపారు. కుటీర, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు, అంకుర సంస్థలు, మహిళా స్వయం సహాయక సంఘాలు, చేతివృత్తుల కళాకారులు రూపొందించిన ఉత్పత్తులను విదేశాలకు పంపేందుకు పార్వతీపురం ప్రధాన తపాలా కార్యాలయంలో ‘డాక్ ఘర్ నిర్యాత్ కేంద్రం’ సదుపాయం కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ కేంద్రం ద్వారా పంపే పార్సిళ్లకు ‘సమన్వయ వస్తు సేవల పన్ను’ (ఐజీఎస్టీ) రిఫండ్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఖాతాదారులు, ప్రజలు ఈ తపాలా సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
హోంగార్డ్ కుటుంబానికి చేయూత
విజయనగరం టౌన్: జిల్లా పోలీసుశాఖలో హోంగార్డ్‌గా పనిచేసి, ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డ్ సీహెచ్.చిట్టినాయుడికి చేయూతనందించేందుకు హోంగార్డ్ సిబ్బంది పోగుచేసిన ఒక్కరోజు డ్యూటీ అలవెన్స్ రూ.3 లక్షల 69వేల 300 చెక్కును ఎస్పీ ఏఆర్.దామోదర్ మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసుశాఖలో పనిచేస్తూ ప్రమాదశాత్తు, అనారోగ్యంతో మరణించిన, ఉద్యోగవిరమణ చేసిన హోంగార్డ్‌ల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు హోంగార్డ్స్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, ఒక్కరోజు డ్యూటీ అలవెన్స్ మొత్తాన్ని పోగుచేసి, వారి కుటుంబాలకు చేయూతగా అందజేయడం అభినందనీయమన్నారు. ఈ తరహా చర్యలు చేపట్టడం వల్ల పోలీసు ఉద్యోగుల్లో ఐకమత్యం పెరగడంతో పాటు, వారి కుటుంబాలకు అండగా నిలిచామన్న భరోసా లభిస్తుందన్నారు. కార్యక్రమంలో హోంగార్డ్ ఇన్చార్జ్ ఆర్‌ఐ ఆర్.రమేష్ కుమార్, ఆఫీస్ సూపరింటెండెంట్ వి.లలిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


