విజయనగరం ఫోర్ట్:
ప్రజారోగ్యంపై చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం చూపుతోందంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అందిన ఫ్యామిలీ డాక్టర్ సేవలు ఇప్పుడు ఎండమావిగా మారాయి. ఇంటింటికీ వైద్యులు వెళ్లి సేవలు అందించే పరిస్థితి కనిపించడం లేదు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ ప్రయాణ ఖర్చులు అమాంతం పెంచేసి తమ అనుకూలమైన కాంట్రాక్టర్‌కు కట్టబెట్టింది. కమీషన్ల రూపంలో ప్రజాధనం లూటీకి స్కెచ్ వేసింది. ఆరోగ్య ఆసరాకు మంగళం పాడేసింది. ఇప్పుడు అత్యవసర వేళ ఆదుకునే 108 వాహనాల వంతు వచ్చింది. అంబులెన్స్ సేవలకు ఆంక్షల కళ్లెం వేసి... ఆపద వేళ సేవలను అందని ద్రాక్షగా మార్చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
● రోగుల తరలింపులో ఆంక్షలు...
గత కొద్ది రోజులుగా 108 అంబులెన్సులకు రోగుల తరలింపు విషయంలో ఆంక్షలు పెట్టినట్టు సమాచారం. ఏ మండలంలో ఉన్న అంబులెన్సు అదే మండలంలో ఉన్న రోగులను మాత్రమే తరలించాలని, పక్క మండలానికి చెందిన రోగులను తరలించడానికి వీలులేదంటూ ఉద్యోగులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. వీటిని బయటపెడితే ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తామని 108 సేవల జిల్లా అధికారి ఒకరు హెచ్చరికలు జారీచేశారట. పీహెచ్‌సీ నుంచి సీహెచ్‌సీకి, సీహెచ్‌సీ నుంచి సర్వజన ఆస్పత్రికి, సర్వజన ఆస్పత్రి నుంచి కేజీహెచ్‌కు తరలింపు విషయంలో ఆంక్షలు పెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా ఆస్పత్రి పరిధి లో ఉన్న 108 అంబులెన్సులు రోగులను రిఫరల్ ఆస్పత్రికి తరలించినప్పుడు మరొక కేసు వస్తే ఆ కేసును ఆస్పత్రిలో చేర్పించిన తర్వాత మళ్లీ వచ్చి తీసుకుని వెళ్లాల్సిందే తప్ప పక్క మండలంలో ఉన్న 108 అంబులెన్సు తీసుకుని వెళ్లడానికి వీలు లేనివిధంగా నిబంధన పెట్టినట్టు సమాచారం. సర్వజన ఆస్పత్రి నుంచి కేజీహెచ్‌కు 108 అంబులెన్సు వెళ్లి వచ్చేసరికి మూడున్నర నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. సర్వజన ఆస్పత్రిలో రోగు లు అధికంగా ఉండడం వల్ల ఎప్పుడు ఎవరికి ఎటువంటి అత్యవసరం అవుతుందో తెలియదు. ఉన్న ఒక్క అంబులెన్సు వెళ్లి రావాలంటే ఈలోగా రోగుల పరిస్థితి విషమం మారే ప్రమాదం ఉంది. దీంతో ఆస్పత్రుల వైద్యాధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రుల అధికారుల గ్రూపుల్లో కూడా ఇదే చర్చ జరుగుతోంది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారిని సకాలంలో ఆస్పత్రికి చేర్చకపోతే ప్రాణాలు ఏ విధంగా కాపాడగలమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విద్య, వైద్యంను ప్రైవేటు పరం చేస్తున్న చంద్రబాబు సర్కారు... 108 వాహనాల భారాన్ని సైతం తగ్గించుకోవాలని చూస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
సర్వజన ఆస్పత్రి వద్ద ఉన్న 108 అంబులెన్సు
ప్రైవేటు అంబులెన్సులే గతి
జిల్లాలో 108 అంబులెన్సులు 28 ఉన్నాయి. రోగులను తరలించడానికి ఆంక్షలు పెట్టడం కారణంగా అత్యవసర పరిస్థితుల్లో రిఫరల్ ఆస్పత్రికి వెళ్లడానికి రోగులు ప్రైవేటు ఆస్పత్రులను అశ్రయించాల్సిన పరిస్థితి. ఇదే అదునుగా ప్రైవేటు అంబులెన్సుల నిర్వాహకులు దోపిడీకి తెరలేపుతున్నారు. ఉచితంగా ఆస్పత్రికి వెళ్లాల్సిన రోగులు వేలాది రూపాయలు ఖర్చుపెట్టి ఆస్పత్రికి వెళ్లాల్సిన దుస్థితి. దీని వల్ల 108 అంబులెన్సుల ఏర్పాటు చేసిన లక్ష్యానికి తూట్లు పడుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. ఆపద సమయంలో ఉన్న రోగులను ఉచితంగా ఆస్పత్రికి చేర్పించి ప్రాణాలు కాపాడాలనే సదుద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి 108 అంబులెన్సులను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు ఆ సేవలకు కోత పెట్టడంపై జనం మండిపడుతున్నారు.
అప్పుడు లేని నిబంధనలు ఇప్పుడే..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అరవిందో సంస్థ 108 వాహనాలను నిర్వహించేది. అత్యవసర కేసులను తరలించడానికి ఆ మండలంలో 108 అంబులెన్సు అందుబాటులో లేకపోతే పక్క మండలంలో ఉన్న అంబులెన్సును పంపించి రోగులను తరలించేవారు. రోగుల తరలింపులో ఎటువంటి ఆంక్షలు, నిబంధనలు ఉండేవికావు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంబులెన్సుల నిర్వహణ బాధ్యతలను భవ్య సంస్థకు అప్పగించింది. ఆపదవేళ ఆదుకోవాల్సిన వాహనానికి ఆంక్షలు పెట్టడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
అవసరం లేని కేసులు రిఫర్ చేస్తున్నారు..
అంబులెన్సులో తరలించడానికి అవసరం లేని కేసులను కూడా ఆస్పత్రులు రిఫర్ చేస్తున్నారు. అంబులెన్సు అనేది అత్యవసర కేసులు తరలించడానికి కదా. అత్యవసరం అనుకున్న కేసులను తరలించడం జరుగుతుంది. – మన్మథనాయుడు, 108 జిల్లా మేనేజర్
108 నిర్వహణ సంస్థ కొత్త
నిబంధనలు!
ఏ మండలానికి కేటాయించిన
అంబులెన్సు ఆ మండలం రోగులనే
తరలించాలన్న షరతు..
అత్యవసరమైనా నిరీక్షించాల్సిందే..
జిల్లాలో 108 అంబులెన్సుల సంఖ్య 28


