విజయనగరం అర్బన్:
కాగితాలపై నగరపాలక సంస్థగా స్థాయి పెరిగింది. జనాభా ముచ్చటగా మూడు లక్షలు దాటిపోయింది!.. కానీ, నగరంలో పారిశుద్ధ్యనిర్వహణ, ప్రజల ఆరోగాన్ని పర్యవేక్షించాల్సిన ‘మెడికల్ అండ్ హెల్త్’ విభాగం మాత్రం ఇప్పటికీ 30 ఏళ్లనాటి పాతకాలం నాటి అంకెల్లోనే బందీగా ఉండిపోయింది. 1996 సంవత్సరంలో కేవలం లక్ష జనాభాను ప్రాతిపదికగా తీసుకుని కేటాయించిన రెగ్యులర్ పోస్టులతోనే నేటికీ నెట్టుకొస్తుండడం పాలకుల ఘోర నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
● 1996 నాటి ప్లానింగ్‌తో 2026లో సేవలా?
30 ఏళ్ల కిందటి నాటి పోస్టుల మంజూరు ప్రకారం లక్ష జనాభాకు సరిపడా రెగ్యులర్ పోస్టులను అప్పట్లో ఇచ్చారు. అయితే, మూడు రెట్లు పెరిగిన జనాభాకు తగ్గట్టుగా ఆరోగ్య విభాగంలో పోస్టుల సంఖ్యను పెంచాల్సింది పోయి, ఉన్న రెగ్యులర్ పోస్టుల ఖాళీలను కూడా భర్తీ చేయకపోవడం వెనుక అధికారుల అలసత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పెరిగిన జనాభా ప్రాతిపదికన కొత్తగా పర్మినెంట్ పోస్టులను మంజూరు చేయడంతో పాటు ప్రస్తుతం ఉన్న 309 ఖాళీలను వెంటనే భర్తీచేసి పని ఒత్తిడి తగ్గించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. తాత్కాలిక, అవుట్ సోర్సింగ్ పద్ధతులపై ఆధారపడడం మానేసి పారిశుద్ధ్య రంగానికి పటిష్టమైన మౌలిక సదుపాయాలు కల్పించి రోగాల భారినుంచి కాపాడాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.
● అవుట్‌సోర్సింగ్‌తో అత్తెసర పాలన!
రెగ్యులర్ సిబ్బందిని భర్తీ చేయకుండా అరకొర జీతాలతో ఆప్కాస్, టెండర్ కార్మికులతో నగర పారిశుద్ధ్యాన్ని నెట్టుకొస్తున్నారు. హెల్త్ వర్కర్ల కొరత తీవ్రంగా ఉండటంతో ప్రధాన మార్కెట్లు, బస్టాండ్, నివాస ప్రాంతాల్లో రెగ్యులర్‌గా ప్రతిరోజూ చెత్త ఎత్తకపోవడం సమస్యగా మారింది. చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి. కాలువల శుభ్రతకు, ఫాగింగ్ చేయడానికి తగినంత సిబ్బంది లేకపోవడంతో డెంగీ, మలేరియా వ్యాధులు నగరవాసులను భయపెడుతున్నాయి. క్షేత్రస్థాయి పరిశీలన చేయాల్సిన సూపర్‌వైజర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ల ఖాళీల వల్ల ప్రైవేటు టెండర్‌దారులు నామమాత్రంగానే పనిచేసి చేతులు దులుపుకుంటున్నారు. చెత్తకుప్పలతో దోమలు వృద్ధిచెంది నగరవాసులపై దాడిచేస్తున్నాయి. అనారోగ్యానికి కారణమవుతున్నాయి. పట్టణంలో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజుకు 10 నుంచి 15 వేల మంది అనారోగ్యం బారిన పడుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి.
భర్తీకాని పోస్టులు
నగర ఆరోగ్య విభాగంలో మంజూరైన రెగ్యులర్ పోస్టుల్లో ఏకంగా 309 పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. పారిశుద్ధ్య వ్యవస్థకు వెన్నెముక లాంటి పబ్లిక్ హెల్త్ వర్కర్ల (రోజూ చెత్త ఊడ్చే కార్మికులు) కేటాయించిన 379 రెగ్యులర్ పోస్టుల్లో 209 ఖాళీగా ఉన్నాయి. ఫీల్డ్ లెవల్‌లో తనిఖీలు చేయాల్సిన శానిటరీ ఇన్‌స్పెక్టర్లు 6 పోస్టులకు 3 ఖాళీలే. ఆరోగ్య కార్యదర్శులు (వార్డ్ హెల్త్ సెక్రటరీలు) 61 పోస్టులకు 25 ఖాళీగా ఉన్నాయి. డ్రైవర్లు, క్లీనర్లు, శానిటేషన్ సెక్రటరీ శాఖల సంఖ్య కొండలా పేరుకుపోయింది.
కుంటుపడుతున్న విజయనగరం
ఆరోగ్య విభాగం పరిస్థితి
పేరుకే నగరపాలక సంస్థ..
అధ్వానంగా పారిశుద్ధ్య నిర్వహణ
రోగాల బారిన నగర ప్రజలు


