విజయనగరం గంటస్తంభం: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆకర్షణీయమైన, సముచితమైన నినాదం ఎంపిక ప్రక్రియను పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తున్నామని కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులకు నిర్వహించిన నినాదాల పోటీల్లో 6199 నినాదాలు అందాయని, వీటిలో 2,355 నినాదాలు ఈమెయిల్‌లోను, 3,844 నినాదాలు వాట్సాప్‌లో అందాయన్నారు. వీటిలో ఉత్తమ నినాదాన్ని ఆగస్టు 14న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అధికారికంగా ప్రకటిస్తామని, నగదు బహుమతిని సీఎంఆర్, విజయనగరం మేనేజింగ్ డైరెక్టర్ మావూరి వెంకటరమణ సమకూర్చుతారన్నారు.
ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా ఎగురవేయాలి
విజయనగరం గంటస్తంభం: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశం కోసం ప్రాణాలర్పించిన వారి త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఇంటిపైనా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు, వ్యక్తులు ఎంతమందనేది తెలియకపోయినా, వారి అందరి ప్రాతినిథ్యానికి ప్రతీక అయిన త్రివర్ణ పతాకాన్ని ప్రతి ఇంటిపై ఎగురవేసి వారి త్యాగాలను స్మరించుకోవాలని కోరారు. ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు ప్రతి మండలం, డివిజన్లు, జిల్లా కేంద్రాల్లో తిరంగా ర్యాలీలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ప్రతి ఒక్కరూ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా దేశం కోసం తాము ఏం సాధించాలనుకుంటున్నాం, 2047 నాటికి మన రాష్ట్రం, దేశం ఎలా ఉండాలనే అంశాలపై అభిప్రాయాలను పంచుకోవాలని, దీనికోసం 30 సెకన్ల సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో ఆప్‌లోడ్ చేసి మన ఆలోచనలను సమాజానికి తెలియజేయాలని కలెక్టర్ కోరారు.
ఊరు దాటాలంటే గెడ్డ దాటాల్సిందే..
గుమ్మలక్ష్మీపురం: కురుపాం మండలం ఉదయపురం పంచాయతీ కంఠుగూడ గ్రామస్తులకు గెడ్డపై వంతెన లేకపోవడంతో రాకపోకలకు అవస్థలు తప్పడం లేదు. గ్రామంలో 13 కుటుంబాలకు చెందిన 60 మంది గిరిజనులు దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్నారు. ఈ గ్రామానికి నేటికీ రోడ్డు సౌకర్యం లేదు. దీంతో ఈ గ్రామస్తులంతా పొలం గట్లపై నుంచి కాలినడకన వెళ్తూ నడుము లోతు (1.2 మీటర్లు) ప్రవహించే గెడ్డను దాటుకుంటూ 2 కిలోమీటర్ల దూరాన ఉన్న డెప్పిగూడ గ్రామం వరకూ వెళ్తూ ఇతర గ్రామాలకు చేరుకోవాల్సిన పరిస్థితి. పెద్దల పరిస్థితి ఎలా ఉన్నా.. గ్రామంలో పాఠశాల, అంగన్‌వాడీ సెంటర్ లేకపోవడంతో అక్కడి విద్యార్థులు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాటిశీలకు, అంగన్వాడీ చిన్నారులు మాషిడిగూడకు ఆ గెడ్డవాగునే దాటుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సీజన్‌లో వర్షాలు పడితే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రాకపోకలు సాగించాల్సి వస్తోదంటూ..పాఠశాలకు వెళ్లిన పిల్ల లు వచ్చేంత వరకూ గుండె కొట్టుకోవడం ఆగదంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని, అలాగే గెడ్డ మీద వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై భద్రగిరి గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖ ఏఈ ఎస్.అప్పారావు వద్ద ప్రస్తావించగా..కంఠుగూడ గ్రామాన్ని సందర్శించామని, ఈ గ్రామానికి వెళ్లే రహదారిలో సీసీ రోడ్డు, గెడ్డ మీద వంతెన నిర్మించాల్సిన అవసరం ఉందని, అందు నిమిత్తం రూ.2.60 కోట్లతో ప్రతిపాదనలు సిధ్ధం చేశామని తెలియజేశారు.
పార్వతీపురంలో ఆయుధాగారం
పార్వతీపురం రూరల్: పోలీస్ సిబ్బంది భద్రత, ప్రజారక్షణే లక్ష్యంగా అత్యవసర సమయాల్లో ఆయుధాలు త్వరితగతిన సమకూరేలా పార్వతీపురం రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో నూతనంగా నిర్మించిన ‘బెల్ ఆఫ్ ఆర్‌మ్స్’ (ఆయుధాగారం)ను విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఆయుధాల సంరక్షణ, సాంకేతిక నిర్వహణ అత్యంత కీలకమని స్పష్టం చేశారు. సామగ్రి నిర్వహణలో అలసత్వానికి తావులేకుండా నిబంధనల ప్రకారం నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి, అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, సీఐలు రమణమూర్తి, వెంకట్రావు, ఆర్‌ఐలు నాయుడు, రాంబాబు, ఆదినారాయణ పాల్గొన్నారు.


