● విజయనగరం కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
విజయనగరం రూరల్: కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని, ఉజ్వల భవిత సొంతమవుతుందని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి అన్నారు. విజయనగరం శివారు డబుల్ కాలనీ వద్ద ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని (కేజీబీవీ) మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. బోధనా తీరు, అభ్యసనా సామర్థ్యాలను పరీక్షంచారు. పదోతరగతి, ఇంటర్ విద్యార్థులకు రసాయన శాస్త్రం, జీవశాస్త్రం సబ్జెక్టులపై పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. చక్కగా చదువుకోవాలని సూచించారు. పదో తరగతిలో 594 మార్కులు సాధించిన గంగూబూడి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఉమాపార్వతిని అభినందించేందుకు స్వయంగా ఆమె ఇంటికి వెళ్లానని, విద్యార్థిని భవిష్యత్‌కు పూర్తి భరోసా కల్పిస్తూ ఆమెను విజయవాడలోని ఒక మంచి కళాశాలలో చేర్పించామని తెలిపారు. భవిష్యత్తులో ఎయిమ్స్‌లో సీటు సాధించాలన్న ఆ బాలిక లక్ష్య సాధనకు జిల్లా యంత్రాంగం తరఫున తమవంతు పూర్తి సహకారాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం విద్యాలయంలో సదుపాయాలు, మెనూ అమలు తీరును ప్రిన్సిపాల్ సుజాతకుమారిని అడిగి తెలుసుకున్నారు.


