చంద్రబాబుది అబద్ధాల పాలన | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబుది అబద్ధాల పాలన

Aug 1 2026 1:13 AM | Updated on Aug 1 2026 1:13 AM

విజయనగరం:

భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్టు నిర్మాణ చరిత ప్రజలకు తెలుసని, సీఎం చంద్రబాబు చెబుతున్న అబద్ధాలను నమ్మే స్థితిలో ఎవరూ లేరని జెడ్పీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ఎవరైనా తాము చేసింది చెప్పుకుంటారని.. చంద్రబాబు ప్రభుత్వం వారు చేయని పనులు చేసినట్లు చెప్పుకోవడం దిగజారుడు తనానికి నిదర్శనమని విమర్శించారు. ఉత్తరాంధ్రకే తలమానికంగా నిలిచే భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం ఘనత మాజీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం అంతా తామే చేశామంటూ క్రెడిట్‌ చోరీ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని వాఖ్యానించారు. ధర్మపురిలోని సిరిసహస్ర రైజింగ్‌ ప్యాలెస్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎయిర్‌పోర్ట్‌ శంకుస్థాపన నుంచి నేటి వరకు ఏ ప్రభుత్వంలో ఎవరేమి చేశారో ఆధారాలతో సైతం వివరించారు.

అన్ని అనుమతులు తీసుకున్న తరువాతే 2023లో శంకుస్థాపన...

భోగాపురంలోని గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని మజ్జి శ్రీనివాసరావు స్పష్టంచేశారు. 2,203 ఎకరాల్లో ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్న తరువాతనే 2023 మే నెలలో అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారన్నారు. శంకుస్థాపనకు ముందు రూ.135 కోట్లతో 14 కిలోమీటర్ల మేర కాంపౌండ్‌ వాల్‌, విద్యుత్‌ సబ్‌స్టేషన్‌, లైటింగ్‌ సిస్టమ్‌, అప్రోచ్‌ రోడ్లు, తాత్కాలిక నీటిసరఫరా ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. ఫలితంగానే ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం నిర్ణీత సమయానికి పూర్తయిందని వెల్లడించారు. శంకుస్థాపన అనంతరం 2024 జూన్‌ 12 నాటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కేంద్రమంత్రి హోదాలో పర్యటించిన రామ్మోహన్‌నాయుడు అప్పటి వరకు 23 శాతం పనులు పూర్తయినట్లు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. అనంతరం సదరు జీఎంఆర్‌ సంస్థ అగ్రిమెంట్‌ ప్రకారం పనులు చేపట్టడం మినహా ఇందులో రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. శంకుస్థాపన రోజునే ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణ బాధ్యతలు తీసుకున్న జీఎంఆర్‌ సంస్థ అధినేత గ్రంధి మల్లికార్జునరావు 2026 నాటికి పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని వెల్లడించారని, జిల్లా వాసిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని చెప్పారు. తాజాగా అంతా తామే చేసినట్లు చంద్రబాబు సర్కారు చెబుతుండడంపై ప్రజలు నవ్వుతున్నారన్నారు.

ఉత్తరాంధ్రుల ఆర్థిక ప్రగతికి

తండ్రీకొడుకులు సాయం

రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధిని కాంక్షిస్తూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్సార్‌, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేశారని మజ్జి శ్రీనివాసరావు గుర్తు చేశారు. ప్రజల అవసరాలను , సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చొరవ చూపిన వ్యక్తులుగా చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఎంతో మంది ఉన్నత స్థాయి నాయకులున్నా ఎవ్వరూ చేయని అభివృద్ధిని తండ్రీతనయులు చేశారన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, మూలపాడు పోర్టు, సముద్ర తీరంలో జెట్టీల నిర్మాణం, ఉద్దానంలో మంచి నీటి సరఫరా, భోగాపురంఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం, ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు నిర్మాణం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు.

ఉత్తరాంధ్ర ప్రజల కళ సాకారం...

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవం వల్ల ఉత్తరాంధ్ర ప్రజల కళ సాకారమవుతుందన్నారు. కార్యక్రమంలో ముఖ్య అథిగా పాల్గొనేందుకు వస్తున్న ప్రధాని నరేంద్రమోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని నిర్ణీత సమయానికి పూర్తిచేసిన జీఎంఆర్‌ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో విజయనగరం జిల్లా అభివృద్ధి పథంలో నడుస్తుందని ఆకాంక్షించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కె.వి.సూర్యనారాయణరాజు, నెక్కల నాయుడుబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, ఇప్పిలి అనంత్‌, జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎయిర్‌పోర్టు నిర్మాణ చరిత ప్రజలకు తెలుసు

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం

ఘనత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిదే..

ఉత్తరాంధ్రుల ఆర్థిక అభివృద్ధే తండ్రీ, తనయుల ఆకాంక్ష

అన్ని అనుమతులు తీసుకున్న తరువాతే 2023లో శంకుస్థాపన

అప్పట్లో ఇచ్చిన మాట ప్రకారం 2026 నాటికి నిర్మాణం పూర్తి

భోగాపురం ఎయిర్‌ పోర్టుతో

ఉత్తరాంధ్రుల కల సాకారం

జెడ్పీ చైర్మన్‌, వైఎస్సార్‌ సీపీ జిల్లా

అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement