విజయనగరం రూరల్:
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై రాష్ట్ర ప్రజలకున్న అభిమానాన్ని చంద్రబాబు అడ్డుకోవడం, అరచేతితో సూర్యకాంతిని అడ్డుకోవడంలాంటిదేనని మాజీ డిప్యూటీ స్పీకర్, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి అన్నా రు. తన నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పరామర్శ నేపథ్యంలో విజయనగరం జిల్లా మీదుగా గురు వారం పర్యటన సాగించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు, ఆయనకు స్వాగతం పలికేందుకు జిల్లా వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున తరలివెలుతుంటే అధికార పార్టీ నేతల ఒత్తిడితో పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం విచారకరమన్నారు. యువత, ప్రజలు, అభిమానులు తమ వాహనాలను దూరంగా నిలిపేసి జననేతను చూడటానికి కిలోమీటర్ల మేర నడిచి వెళ్లి తమ అభిమానాన్ని చాటుకున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో అధికారమదంతో ఈ విధమైన అడ్డంకులు సృష్టించడం సరికాదని మండిపడ్డారు. ప్రజలకు సేవ చేస్తున్న మాజీ మంత్రి అప్పలరాజుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. ప్రమాదంలో చనిపోయిన కుటుంబానికి కూటమి మంత్రి రూ.10 లక్షలు, ఇల్లు ఇస్తామని ప్రకటించడంతో మాజీ మంత్రిపై వారి అక్కసు తేటతెల్లమవుతోందన్నారు. రాష్ట్రంలో ప్రమాదాల్లో చనిపోయిన ప్రతీ ఒక్కరికీ ఇదే పరిహారం అందిస్తారా అని ప్రశ్నించారు.
వైఎస్ జగన్ సంకల్పమే
నేటి భోగాపురం విమానాశ్రయం
గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ సంకల్పంతోనే నేడు భోగాపురంలో అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సాగుతోందని కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. విమానాశ్రయం నిర్మాణానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. అప్పటివరకు 70 శాతం పనులు పూర్తిచేసిందన్నారు. 2024లో ప్రభుత్వం మారడంతో విమానాశ్రయ పనులు వేగవంతం చేయాల్సిన చంద్రబాబు సర్కారు ఎక్కడ ఆ క్రెడిట్ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్న దురుద్ధేశంతో పనులు ఆలస్యం చేసి రెండేళ్లు సాగదీసి, క్రెడిట్‌ను చోరీ చేసిందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే కృషి జరిగిందన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని సాదరంగా ఆహ్వానిస్తున్నామని, దీనిలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాత్ర వెలకట్టలేనిదన్నారు.
సూపర్‌సిక్స్ పథకాలతో మోసగించారు
కూటమి నేతలు ఎన్నికల హామీల్లో సూపర్‌సిక్స్ పథకాలు అమలు చేస్తామని హామీలను ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక వాటిని పక్కన పెట్టేశారని కోలగట్ల విమర్శించారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తున్నామని చెబుతున్న చంద్రబాబు సర్కారు కలియుగదైవం వేంకటేశ్వరుని ఎదుట ప్రమాణం చేసి చెప్పగల ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు సర్కారు అబద్ధపు ప్రచారాలు చేస్తుండటాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టబోయే పోరుబాటలో ప్రజలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి, పార్టీ పట్టణ, మండలాధ్యక్షులు ఆశపు వేణు, కెల్ల త్రినాథ్, ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, పార్టీ నాయకులు బంగారునాయుడు, ఎస్.వి.వి.రాజేష్, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ జగన్ పర్యటన విజయవంతం
పోలీసులు అడ్డంకులు సృష్టించడం విచారకరం
రెట్టించిన ఉత్సాహంతో అభిమానులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు
అంతర్జాతీయ విమానాశ్రయం
తీసుకొచ్చిన ఘనత వైఎస్
జగన్‌మోహన్‌రెడ్డిదే..
మాజీ డిప్యూటీ స్పీకర్, వైఎస్సార్
సీపీ సీఈసీ సభ్యుడు
కోలగట్ల వీరభద్రస్వామి


