భోగాపురం జాతీయరహదారిపై ప్రజలకు అభివాదం చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తదితరులు
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
జై జగన్.. జైజై జగన్.. అన్నా.. మళ్లీ నువ్వే సీఎం.. అన్న నినాదాలతో జాతీయ రహదారి హోరెత్తింది. జననేత అభివాదం చేస్తూ ముందుకు సాగుతుండగా అభిమానలోకం ఉరకలెత్తే ఉత్సాహంతో వెంటసాగింది. మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఘనంగా స్వాగతం పలికింది. శ్రీకాకుళం జిల్లా అంపోలు సబ్ జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు జిల్లా మీదుగా గురువారం వెళ్లిన జననేతకు స్వాగతం పలికేందుకు ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జననేత రాకకోసం జాతీయ రహదారిపై వివిధ కూడళ్లలో ఎదురుచూశారు. ఆయన కనిపించేసరికి ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఉదయం 10 గంటల నుంచి మహిళలు, యువత, విద్యార్థులు నెల్లిమర్ల నియోజకవర్గంలోని భోగాపురం, నాతవలస, సీహెచ్ అగ్రహారం తదితర కూడళ్లకు చేరుకుని జననేత రాకకోసం ఎదురు చూశారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి.. దాని శ్రీకారానికి మీరే కారణం.. థాంక్యూ జగన్ సర్ అంటూ ప్ల కార్డులు చూపిస్తూ ధన్యవాదాలు తెలిపారు. రోడ్డు పక్కన పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. రైతులు...యువత జననేతతో కరచాలనానికి ఎగబడ్డారు. ఎక్కడికక్కడ ఆయన వాహనానికి స్వాగతం పలుకుతూ అడుగు పడనివ్వకుండా.. కాన్వాయ్ ముందుకు సాగనివ్వకుండా అభిమాన దడి కట్టేశారు. పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు జననేత వెంట శ్రీకాకుళం వరకు సాగారు.
గజమాలతో స్వాగతం
నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండల అప్పలనాయుడు సారథ్యంలో వందలాది మంది యువకులు గజమాలతో స్వాగతం పలికారు. దాదాపు కిలోమీటరు దూరం నుంచి కనిపించేలా ఆకాశానికి భూమికి నిచ్చెన వేసేలా పార్టీ రంగులతో గజమాల భారీ క్రేన్‌కు వేలాడుతూ జననేతకు స్వాగతించింది. వేలాది కార్యకర్తల నడుమ ఆ గజమాల వైఎస్ జగన్ మెడలో అలంకారమై తనకుతాను పులకించిపోయింది. ఈ కార్యక్రమం ఆద్యంతం భోగాపురం, డెంకాడ మండలాల కార్యకర్తలు యువతలో నూతనోత్సాన్ని నింపింది.
సీహెచ్ ఆగ్రహరంలో...
సీహెచ్ అగ్రహారం కూడలిలో వేలాదిమంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు చేరుకుని వైఎస్ జగన్‌కు స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపులా బారులు తీరి జైజగన్ అంటూ నినదించారు.
పోలీసు ఆంక్షలను ఛేదించి..
భోగాపురం విమానాశ్రయం నిమిత్తం ప్రధాని రాకతో ఎక్కడికక్కడ పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం... ఆ పోలీసులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నిలువరించేందుకు ఉపయోగించింది. అయితే, జననేతను చూడాలన్న లక్ష్యంతో జనం వివిధ మార్గాల్లో జాతీయ రహదారికి చేరుకున్నారు. అభిమాన నాయకుడు తమ ఊరు రావడంతో తమ ఇంటికి పండగ వచ్చినట్లు.. తమ ఇంట్లో సంబరం జరుగుతున్నట్లు ఫీలయ్యారు. కొంతమంది తల్లిదండ్రులు బిడ్డలను సైతం తమతో పాటు తీసుకొచ్చి తమ అభిమాన నాయకుడితో ఫొటోలు తీయించి షేక్ హ్యాండ్ చేయించడానికి ఉత్సాహపడ్డారు.
● భోగాపురంలో వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి, నాయకులు యు.శివారెడ్డి, యు.విజయబాస్కరరెడ్డి, కె.వెంకటరమణ తదితరులు జననేతకు స్వాగతం పలికారు.
● నాతవలస వద్ద ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్యేలు అలజంగి జోగారావు, విశ్వాసరాయి కళావతి, శంబంగి వెంకట చినప్పలనాయుడు, వైఎసార్‌సీపీ యువజన, ఐటీ విభాగం అధ్యక్షులు బడ్డుకొండ ప్రదీప్, మణిదీప్, తదితరులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలికారు. మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర తన అనుచరులతో కలిసి జగనన్నకు స్వాగతం పలికేందుకు ర్యాలీగా వచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ డీవీజీ శంకరరావు, నాయకులు మావుడి రంగునాయుడు పాల్గొన్నారు.
జననేతకు అభిమాన హారతి
స్వాగతం పలికేందుకు తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులు
జనసంద్రంగా మారిన జాతీయ రహదారి
జననేతను చూసి కేరింతలు కొట్టిన అభిమానులు


