● సర్వజన ఆస్పత్రిలో నిలిచిపోయిన ప్రధానమైన వైద్య పరీక్షలు
● ప్రైవేటు ల్యాబ్‌ల్లో రూ.వేలల్లో ఖర్చు చేస్తున్న రోగులు
విజయనగరం ఫోర్ట్: విజయనగరం పట్టణానికి చెందిన లక్ష్మి అనే మహిళ ఒంట్లో నీరసంగా ఉంటోందని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు ఆమెకు సుగర్ వ్యాధికి సంబంధించి హెచ్‌బీఏవన్‌సీ పరీక్ష రాశారు. ఆ చీటీ పట్టుకుని ఆమె ఆస్పత్రిలోని ల్యాబొరేటరీ వద్దకు వెళ్లగా అక్కడ సిబ్బంది ఆ పరీక్ష లేదని చెప్పడంతో ప్రైవేట్ ల్యాబొరేటరీలో రూ.500 పెట్టి హెచ్‌బీఏవన్‌సీ పరీక్ష చేయించింది.
● గంట్యాడ మండలానికి చెందిన భవాని అనే మహిళకు థైరాయిడ్ లక్షణాలు కనిపించడంతో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు థైరాయిడ్ పరీక్ష చేసుకోవాలని చీటీ రాసి ఇచ్చారు. అది పట్టుకుని ల్యాబొరేటరీకి వెళ్లగా థైరాయిడ్ పరీక్ష చేయడం లేదని చెప్పడంతో ప్రైవేట్ ల్యాబొరేటరీలో రూ.600 పెట్టి చేయించుకుంది.
● జామి మండలానికి చెందిన రామునాయుడు అనే వ్యక్తికి జ్వరం రావడంతో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వైద్యుడి వద్దకు వెళ్లాడు. అక్కడ వైద్యులు సీబీపీ (కంప్లీట్ బ్లడ్ పిక్చర్) రాశారు. దీంతో సీబీపీ పరీక్ష కోసం ల్యాబొరేటరీ వద్దకు వెళ్లాడు. ఇక్కడ సీబీపీ పరీక్ష చేయడం లేదని చెప్పడంతో ప్రైవేట్ ల్యాబొరేటరీలో రూ.500 పెట్టి చేయించుకున్నాడు.
వీరు ముగ్గురే కాదు. ప్రభుత్వసర్వజన ఆస్పత్రికి వచ్చిన అనేక మంది రోగులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇది. జిల్లాలో అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రి అయినా సర్వజన ఆస్పత్రికి జబ్బు చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు కనీసం వైద్య పరీక్షలు కూడా అందించలేని దుస్థితిలో టీడీపీ సర్కార్ ఉందని రోగులు ఆగ్రహిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లే ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే ఇక్కడ పూర్తిస్థాయిలో వైద్యం అందే పరిస్థితి లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని వసతులు ఉంటాయని జిల్లా నలుమూలల నిత్యం అధిక సంఖ్యలో ఇక్కడికి రోగులు వస్తారు. అయితే ఉచితంగా వైద్యం అందించాల్సిన ఆస్పత్రిలో సౌకర్యాలు లేకపోవడం వల్ల చేతిచమురు వదిలించుకోవాల్సిన దుస్థితి రోగులకు దాపురించింది.
నిలిచిపోయిన ప్రధాన వైద్య పరీక్షలు
రోగులకు వ్యాధి నిర్ధారణలో ప్రధానమైన వైద్య పరీక్షలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో నిలిచిపోయాయి. మధుమేహం(సుగర్) వ్యాధి నిర్ధారణలో అతి ప్రధానమైన హెచ్‌బీఏ1సీ (మూడు నెలల సుగర్‌ను నిర్ధారించే) పరీక్ష కొద్ది రోజులుగా చేయడం లేదు. అదేవిధంగా థైరాయిడ్ పరీక్ష అయితే రెండున్నర నెలలుగా చేయడం లేదు. ముఖ్యంగా సీబీపీ(కంప్లీట్ బ్లడ్‌పిక్షర్) పరీక్ష కూడా గత కొద్ది రోజులుగా నిలిచిపోయింది. ప్రస్తుత సీజన్‌లో ఈ పరీక్ష చాలా అవసరం. ఎందుకంటే సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగీ, టైఫాయిడ్, వైరల్ ఫీవర్స్ అధికంగా ఉన్న నేపథ్యంలో సీబీపీ పరీక్షను ప్రతి రోగికి వైద్యులు రాస్తారు.
కొరవడిన ముందుచూపు
టీడీపీ సర్కార్ కు ముందు చూపు కొరవడిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. బోధనాస్పత్రి కావడంతో సర్వజన ఆస్పత్రికి ప్రతిరోజూ 1000 నుంచి 1200 మంది వరకు రోగులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షలు కూడా అత్యధికంగా జరుగుతాయి. ఈ క్రమంలో ముందస్తుగానే రోగులకు అవసరమైన వైద్య పరీక్షలకు అవసరమైన టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలి. కిట్లు అయిపోయే వరకు సరఫరా చేయక పోవడం పట్ల రోగులు మండిపడుతున్నారు.


