విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న జూనియర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు ఆగస్టు 2న నిర్వహించనున్నట్టు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు లీలాకృష్ణ, శ్రీకాంత్ గురువారం తెలిపారు. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి నగర శివారులోని విజ్జీ స్టేడియం ప్రాంగణంలో ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అండర్–14, 16, 18, 20 వయస్సుల విభాగాల్లో బాల, బాలికలకు రన్స్, త్రోస్, జంప్స్ అంశాల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను వచ్చేనెల 11 నుంచి 13వ తేదీ వరకు తిరుపతిలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. ఎంపిక పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు విధిగా వయస్సు ధ్రువీకరణ పత్రాన్ని వెంట తీసుకురావాలని సూచించారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సమగ్ర శిక్ష ఉద్యోగుల చలో కలెక్టరేట్
విజయనగరం అర్బన్: ఏపీ స్టేట్ సమగ్ర శిక్ష కాంట్రాక్టు అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (జేఏసీ) ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద ‘చలో కలెక్టరేట్’ నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డీఆర్‌ఓకు అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర చైర్మన్ బి.కాంతారావు నాని మాట్లాడుతూ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి పలు రాష్ట్రాల్లో సమగ్ర శిక్ష ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేసినపుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు సాధ్యం కావడంలేదని ప్రశించారు. కేజీబీవీల గౌరవాధ్యక్షురాలు కె.విజయగౌరి, నాయకుడు రామకృష్ణ మాట్లాడుతూ తక్షణమే జూన్, జూలై నెలల జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, పార్ట్‌టైమ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, సమగ్ర హెచ్‌ఆర్ పాలసీ అమలు, ప్రతి నెలా సకాలంలో వేతనాలు చెల్లింపు, పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంపు, ఈపీఎఫ్, గ్రాట్యుటీ, ఆరోగ్య భద్రత కల్పన, డీఎస్సీ నియామకాల్లో సర్వీస్ వెయిటేజీ డిమాండ్లు నెరవేర్చకుంటే ఈ నెల 24న ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు ఆర్.శ్రీనివాసారవు, లక్ష్మణరావు, దేవుడుబాబు, పోలినాయుడు, జయగణేష్ పాల్గొన్నారు.


