బిల్లులు ఆపండి..! | - | Sakshi
Sakshi News home page

బిల్లులు ఆపండి..!

Jul 30 2026 1:15 AM | Updated on Jul 30 2026 1:15 AM

బలిజిపేట: మండలంలోని పెదపెంకి గ్రామంలో అభివృద్ధి పనుల నిర్వహణలో మూడుముక్కలాట సాగుతుండడంతో ప్రత్యేక నిధులు మంజూరుచేసిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు శిరోభారంగా మారింది. పెదపెంకిని దత్తత తీసుకుని ఫైలేరియా రహిత గ్రామంగా తీర్చుదిద్దుదామనుకుని ఉపాధిహామీ పథకం ద్వారా 5.85కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించారు. నిధుల వినియోగంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య మూడుముక్కలాట జరుగుతుండడంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేటాయించిన నిధుల ప్రాప్తికి పనులు నాణ్యతతో జరిగాయా అంటే అదేమీ లేదని రుజువైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ పనుల నిర్వహణపై అసంతృప్తి చెంది కాంట్రాక్టర్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని, సంబంధిత పనుల బిల్లులు వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీచేశారు. పనుల పర్యవేక్షణకు తరచూ బృందాలను పంపిస్తున్నారు.

అందరు భాగస్వాములే..

పెదపెంకి అభివృద్ధి పనుల్లో లోపాలకు ఎమ్మెల్యే విజయచంద్ర, స్థానిక నాయకులు, అధికారులు, కాంట్రాక్టర్లు అందరూ భాగస్వాములేనని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. స్థానిక నాయకులకు, ఎమ్మెల్యేకు మద్య విభేదాలు ఉండడంతో రణరంగం జరిగిందని చెబుతున్నారు. పనులు ప్రారంభించేటప్పుడు స్థానిక నాయకులు కొంతమందికి పనులు అప్పగించి చేయిస్తుండగా ఎమ్మెల్యే విజయచంద్ర వచ్చి ఆయన ప్రతిపాదించిన వ్యక్తికి కాంట్రాక్ట్‌ పనులు అప్పగించాలని అధికారులపై ఒత్తిడి తేవడంతో తలొగ్గిన అధికారులు కొత్త కాంట్రాక్టర్‌ చేత పనులు చేయించారు. దీంతో ఆ కాంట్రాక్టరు ఇష్టానుసారం పనులు చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు వారితో కుమ్మకై ్క వారి పాత్ర వారు పోషిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు.

బృందాల పర్యవేక్షణ

ఇటీవల రాష్ట్రస్థాయి చీఫ్‌ క్వాలిటీ కంట్రోల్‌ అధికారి పనుల నాణ్యతను పరిశీలించారు. పనుల్లో నాణ్యతా లోపాలు ఉన్నట్లు గుర్తించి నివేదికలు అందించారు. మంగళవారం డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ పేషీ నుంచి ఓఎస్‌డీ కె.సాయినవీన్‌ బృందం వచ్చి గ్రామంలో జరిగిన పనుల నిర్వహణ ఏవిధంగా ఉంది, ఏం జరుగుతోంది? ప్రజల అభిప్రాయం ఏమిటి? వారి సమస్యలు ఏమిటనేది తెలుసుకునేందుకు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు.

21పనులకు బిల్లులు పెట్టాల్సి ఉంది

పెదపెంకిలో ముందుగా 5.80కోట్లతో 66సీసీ రోడ్లు, 18ఆర్‌డబ్ల్యూఎస్‌ పనుల నిర్మాణాలకు ప్రతిపాదనలు చేశారు. ఆ తరువాత అంతర్గత పరిణామాలతో 49సీసీ రోడ్ల నిర్మాణాలు చేయాలని వాటికే నిధుల కేటాయింపు అని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో 17సీసీ రోడ్ల నిర్మాణాల బిల్లుల విషయం సందిగ్థంలో పడింది. సీసీ రోడ్లకు సంబంధించి 21పనులకు బిల్లులు పెట్టాల్సి ఉంది. ఉపాధిహామీ పథకంలో రూపురేఖలు మారడంతో కొత్త సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ అయ్యేవరకు బిల్లుల సమస్య ఉండే అవకాశాలున్నాయి. జరిగిన పనులకు బిల్లులు చెల్లింపు చేయాలని కోరుతున్న కాంట్రాక్టర్లు పనుల విషయంలో ముఖం చాటేస్తుండడంతో పనుల్లో తాత్సారం జరుగుతున్నట్లు సమాచారం. ఇంతలో ఒక్కసారిగా పిడుగుపడినట్టు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో పనులు ఎంతమేర జోరుగా సాగుతాయో? లేదా నత్తనడకగా సాగుతాయా ? అనేది వేచి చూడాల్సిందే.

డిప్యూటీ సీఎం ఆదేశాలు

పెదపెంకిలో చేసిన పనుల్లో నాణ్యతా లోపాలు

పనులు పరిశీలిస్తున్న కొత్త బృందం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement