విజయనగరం అర్బన్:
జిల్లాలో ప్రతిపాదించిన ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)–2026 ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ స్థానిక ఓటర్లలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శుక్రవారం విడుదల చేసిన ప్రాథమిక ఓటరు జాబితాను పరిశీలిస్తే అధికారుల ఉదాసీనత, క్షేత్రస్థాయి సర్వేలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఓటర్ల వివరాలు సేకరించ లేకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
లక్షకు పైగా ఓట్లు ప్రశ్నార్థకం..!
జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 15,78,949 డిజిటలైజ్డ్ గణన ఫారాలను అధికారులు పరిశీలించారు. ప్రస్తుతం ముసాయిదా జాబితాలో 14,51,072 మందికి మాత్రమే చోటు దక్కింది. దీంతో దాదాపు 1.27 లక్షల మంది ఓటర్ల భవిష్యత్తు ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో పడింది. సేకరించలేని ఫారాలలో కేవలం మరణాల పేరిట వేలాది మందిని పక్కన పెట్టడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఉపాధి కోసం తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారిని, సర్వే సమయంలో ఇంట్లో లేని వారిని ‘శాశ్వత బదిలీ’, ‘గైర్హాజరు’ కింద జమ కట్టేశారనే ఆరోపణలు వస్తున్నాయి. రాజాం నియోజకవర్గంలో అత్యధికంగా 223,688 ఫారంలు, బొబ్బిలిలో 21,274 ఫారంలు, చీపురుపల్లిలో 19,060 ఫారంలు లభించలేదని రికార్డుల్లో చూపడం క్షేత్రస్థాయి సర్వే ఎంత అసంపూర్తిగా సాగిందో అర్థం పడుతోంది.
నోటీసుల పేరుతో సామాన్యుడిపై భారం
ఓటరు వివరాలు సమర్పించని వారికి, వ్యత్యా సాలు ఉన్న వారికి నోటీసులు జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ నోటీసుల ప్రక్రియ నరకంగా మారే ప్రమాదం ఉంది. గుర్తింపు కోసం 11 రకాల కఠినమైన పత్రాలను ప్రతిపాదించడంతో సామాన్యులు, రెక్కాడితేగానీ డొక్కాడని పేద ప్రజలు తహసీల్దార్, ఈఆర్‌ఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. కేవలం ఆగస్టు 30 వరకు క్లైవ్‌ఏులు, అభ్యంతరాలకు గడువు ఇవ్వడం వల్ల తక్కువ సమయంలో అర్హులైన ఓటర్లు తమ పేర్లు నిలబెట్టుకోవడం సవాలుగా మారింది. బీఎల్‌ఓలు సరిగ్గా ఇళ్లకు రాకుండానే ‘గైర్హాజరు’, ‘బదిలీ’ అని రాసేశారని, ఇప్పుడు తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి పనులు వదులుకుని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని పలువురు బాధితులు వాపోతున్నారు. ఆగస్టు 30లోపు బాధితులంతా స్పందించి దరఖాస్తులు చేసుకోకపోతే అక్టోబర్ 3న ప్రచురించే తుది జాబితాలో వేలాది మంది ఓటు హక్కును శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.
11 రకాల ఽధ్రువీకరణ పత్రాలు..
వివరాలు నింపి ఎన్యూమరేషన్ పత్రాలు బీఎల్‌ఓలకు సమర్పించిన వారిలో చాలా మంది 2002 నాటి జాబితాలో తమ, తమ సంబంధీకుల వివరాలతో మ్యాపింగ్ చేసుకోలేదు. అలాంటి వారికి నోటీసులిస్తారు. వీరు ఆధార్ కార్డు కాకుండా.. ఎన్నికల సంఘం నిర్ధేశించిన 11 రకాల ఽధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాలి. వాటిలో కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛనుదారుకు జారీ చేసిన ఐడెంటిటీ కార్డు లేదా పింఛను పేమెంట్ ఆర్డర్ ఉంటే సరిపోతుంది. అలాగే 1987 జూలై 1కు ముందు ప్రభుత్వ/స్థానిక సంస్థలు/బ్యాంకులు/జనన ధ్రువీకరణ పత్రం, బోర్డు/విశ్వవిద్యాలయం జారీ చేసిన విద్యా సర్టిఫికెట్లు, శాశ్వత నివాస ధ్రువీకరణ, అటవీ హక్కుల చట్టం సర్టిఫికెట్, కుల ఽధ్రువీకరణ. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(అమల్లో ఉన్న ప్రాంతాల్లోనే). రాష్ట్ర/స్థానిక సంస్థలు తయారు చేసిన ఫ్యామిలీ రిజిస్టర్, ప్రభుత్వం జారీ చేసిన భూమి/ఇంటి కేటాయింపు పత్రాలు.
జిల్లాలో 1.27 లక్షలకు పైగా ఓట్లకు గండం
సర్ ప్రక్రియ తర్వాత భారీగా తగ్గిన
ఓటర్ల సంఖ్య
నోటీసుల పేరుతో సామాన్యులకు
తప్పని తిప్పలు
ముసాయిదా జాబితా విడుదల


