● మంత్రి ఎం.రాంప్రసాద్‌రెడ్డి
విజయనగరం అర్బన్: ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేయబోమని ప్రభుత్వ బస్సులు, కార్మికులు ఉన్నప్పుడే సంస్థ మనుగడ సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి కార్మికులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. సంస్థ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం నుంచి సాధ్యమైనంత సహాయం అందిస్తామని తెలిపారు. శుక్రవారం ఆర్టీసీ జోనల్ వర్క్‌షాప్‌ను సందర్శించి, క్షేత్ర స్థాయిలో అందుతున్న సేవలు, పనితీరును తనిఖీ చేశారు. వర్క్‌షాప్‌లో ఎఫ్‌ఐపీ, ఇంజన్, మెషిన్ షాప్, ఎలక్ట్రికల్, బాడీ షాప్, గేర్ బాక్స్, లేత్ మిషన్ సెక్షన్లను దగ్గరుండి పరిశీలించారు. బస్సుల నిర్వహణ, మరమ్మతుల నాణ్యతపై అధికారులను ఆరా తీశారు. ప్రయాణికులకు సురక్షితమైన, మెరుగైన సేవలు అందించేలా నిర్వహణ ప్రమాణాలు పాటించాలని అధికారులకు మంత్రి సూచించారు. ఖర్చులు తగ్గిస్తూనే నాణ్యతను పెంచడంలో ఆర్టీసీ ముందుండాలని పిలుపునిచ్చారు. విజయనగరం వర్క్‌షాప్ జోన్ అంతటికీ ఉత్తమ సర్వీసులు అందిస్తోందని అధికారులు మంత్రికి వివరించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగానే సంస్థలోకి ఎలక్ట్రిక్, సీఎన్జీ బస్సులను ప్రవేశపెడుతున్నామని ఆయన తెలిపారు.కార్యక్రమంలో భాగంగా ఇటీవల పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో విశాఖపట్నం రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు, వర్క్స్ మేనేజర్లు వరుణ్ కుమార్, అరుణ, స్టోర్స్ అధికారి రాజశేఖర్, సెక్యూరిటీ ఆఫీసర్ దుర్గాప్రసాద్, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్, పలువురు అధికారులు, సూపర్‌వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


