వైన్ షాపులో స్కెచ్.. జిమ్ కోచ్ మర్డర్
● వెంకునాయుడు హత్య కేసు మిస్టరీ వీడింది
● వ్యభిచార కార్యకలాపాల్లో తేడాల్లో కారణం
● ఏడుగురు నిందితుల అరెస్ట్
● డీఎస్పీ విష్ణుస్వరూప్ వెల్లడి
పరవాడ: లంకెలపాలెం శ్రీరామనగర్ కాలనీలో ఈ నెల 23న అర్ధరాత్రి జరిగిన ఈగల వెంకునాయుడు (39) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసుకు సంబంధించి దాసరి తేజస్వి (దానబోయిన పాలెం, అగనంపూడి), కనాటి దేముడునాయుడు (శనివాడ దరి కేఎస్‌ఎన్‌రెడ్డి నగర్), గొల్లు దినేష్‌కుమార్ (ఎస్.కోట మండలం సీతారాంపురం), చింతాడ సూర్యప్రకాష్ (తురకపేట, హిరమండలం), గుడె జాన్ ప్రశాంత్‌కుమార్(దయాల్‌నగర్), అదురి దాసు(హెచ్‌బీ కాలనీ), గుందేటి వంశీ (సంజీవనిగిరి, గాజువాక)లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మల్లికార్జునరావుతో కలిసి డీఎస్పీ వి.విష్ణుస్వరూప్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. శ్రీరామనగర్ కాలనీలో నివాసముంటున్న మొల్లి సరస్వతి.. కూర్మన్నపాలెంలోని ఓ జిమ్‌లో కోచ్‌గా పనిచేస్తున్న ఈగల వెంకునాయుడుతో నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఈ నెల 23న అర్ధరాత్రి దాటిన తర్వాత తేజ అనే వ్యక్తి వెంకునాయుడుకి ఫోన్ చేసి మాట్లాడాలని బయటకు పిలిచాడు. అలా వెళ్లిన వెంకునాయుడు తిరిగి రాలేదు. 24న ఉదయం ఇంటికి సమీపంలోనే రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండడాన్ని గమనించిన సరస్వతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కక్షలు.. కుట్రలు
ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, సీసీ ఫుటేజీలు, మొబైల్ డేటాను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు నిందితుల కోసం నాలుగు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. ఈ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. వెంకునాయుడు వ్యభిచార కార్యకలాపాల విషయంలో దాసరి తేజకు సహకరించకుండా, వేరే వర్గానికి మద్దతుగా నిలిచాడు. అంతేకాకుండా తేజ అనుచరుడైన కనాటి దేముడునాయుడును తరచూ కొట్టడం, తిట్టడం, డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడం, అర్ధరాత్రి వేళల్లో పనులు పురమాయించి అవమానించేవాడు. దీంతో తేజ, దేముడునాయుడు అతడిపై కక్ష పెంచుకున్నారు. అలాగే తేజకు సంబంధించిన వ్యభిచార కార్యకలాపాల్లో ఉన్న ఇతరులకు సామూహిక శత్రువుగా మారిపోయాడు. ఈ నెల 23 రాత్రి దువ్వాడలోని ఓ వైన్ షాపులో శత్రువులంతా సమావేశమై వెంకునాయుడు హత్యకు పథకం రచించారు. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం.. అర్ధరాత్రి అతనికి ఫోన్ చేసి బయటకు రప్పించారు. అప్పటికే సిద్ధంగా ఉంచిన పెద్ద బండరాయితో ముఖం, తలపై పలుమార్లు మోది కిరాతకంగా హత్య చేశారు. ఈ హత్యలో కొందరు ప్రత్యక్ష దాడిలో పాల్గొనగా, మరికొందరు పరోక్షంగా సహకరించినట్లు దర్యాప్తులో తేలిందని డీఎస్పీ తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం తాడి మూడు మదుముల వద్ద ఐదుగురిని, గాజువాక దుర్గానగర్ ప్రాంతంలో మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను అనకాపల్లి న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్ విధించారు. హత్య కేసును ఛేదించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు. ఎస్‌ఐలు మహాలక్ష్మి, భీమరాజు, ట్రైనీ డీఎస్పీ చైతన్య, సిబ్బంది పాల్గొన్నారు.


