సీనియర్స్ ఖోఖో పోటీల్లో జిల్లాకు ద్వితీయ స్థానం
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరిగిన సీనియర్స్ ఖోఖో పోటీల్లో విజయనగరం జిల్లా జట్టు సత్తా చాటింది. ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు గుడివాడ జరిగిన పోటీల్లో పురుషుల విభాగంలో ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి ద్వితీయస్థానంలో నిలిచారు. రాష్ట్రస్థాయిలో జరిగిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను, కోచ్ అండ్ మేనేజర్‌లను జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు.
అంబకండిలో అగ్నిప్రమాదం
రేగిడి: మండల పరిధిలోని అంబకండి గ్రామంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురి రైతులకు చెందిన ధాన్యం బస్తాలు, గడ్డివాములు దగ్ధమయ్యాయి. రైతులు అందించిన సమాచారం మేరకు అందరూ పొలాల్లో ఉన్న సమయంలో అగ్నిప్రమాదం ఎలా సంభవించిందో తెలియరాలేదు. ఈ ప్రమాదంలో ఎవర్న సత్యంనాయుడు, ఎవర్న రాము, ఎవర్న లక్ష్మి, ఎవర్న రామునాయుడు, ఎవర్న రాము, కరకవలస ఆదినారాయణ, తదితర రైతులకు చెందిన 50 బస్తాల ధాన్యంతో పాటు గడ్డివాములు పూర్తిగా కాలిపోయాయి. ఆరుగాలం కష్టించి పండించుకున్న పంట చేతికందొచ్చిన సమయంలో అగ్గిపాలు కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. స్థానికులు రాజాం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో వారు వచ్చి కొంతమేర మంటలు అదుపుచేయడంతో పరిసర ప్రాంతాల్లోని చేనుకుప్పలకు ప్రమాదం జరగకుండా ఆపగలిగారు.
● బాలికకు తీవ్ర గాయాలు
కొమ్మాది: భీమిలి బీచ్‌రోడ్డులో శుక్రవారం సాయంత్రం ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి.. తొలుత రోడ్డు పక్కన ఉన్న జనరేటర్‌ను, ఆపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ బాలికను ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. జీవీఎంసీ 4వ వార్డు మంగమారిపేట సమీపంలోని వీబీసీ కాలనీకి చెందిన వాసుపల్లి కార్తీక అనే బాలిక నగరపాలెం జంక్షన్ వైపు నడుచుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో నగరం నుంచి భీమిలి వైపు అతివేగంగా వస్తున్న ఓ కారు అదుపు తప్పింది. ముందుగా రోడ్డుకు ఆనుకుని ఉన్న పెద్ద జనరేటర్‌ను బలంగా ఢీకొనడంతో అది తిరగబడిపోయింది. అనంతరం అక్కడి నుంచి దూసుకెళ్లి బాలికను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కార్తీక తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను రుషికొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించా రు. ప్రస్తుతం బాలిక ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు ఆమె తల్లి వాసుపల్లి నూకరత్నం తెలిపారు. కారును విజయనగరం జిల్లా రాజాంనకు చెందిన ఎర్రగుంట్ల ప్రీతమ్ నడుపుతున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై బాలిక తల్లి భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
విజయనగరం క్రైమ్: విజయనగరం రైల్వేస్టేషన్‌లో 4,5 నంబర్ ప్లాట్‌ఫామ్‌పై శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి స్పృహ లేకుండా పడి ఉండడంతో జీఆర్‌పీ సిబ్బంది గమనించి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 45 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉంటుందని, 5 అడుగుల 8 అంగుళాల పొడవు కలిగి చామన ఛాయ రంగు ఉన్నాడని, తెలుపురంగుపై పింక్ కలర్ పువ్వులు గల ఫుల్‌హ్యాండ్ షర్ట్, బ్లూ కలర్ జీన్ ప్యాంట్ ధరించి ఉన్నాడని జీఆర్పీ ఎస్సై బాలాజీ రావు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు ఫోన్ 9490617089, 8309430708 నంబర్లకు సమాచారం అందజేయాలని కోరారు.
సీనియర్స్ ఖోఖో పోటీల్లో జిల్లాకు ద్వితీయ స్థానం
సీనియర్స్ ఖోఖో పోటీల్లో జిల్లాకు ద్వితీయ స్థానం


