జూలో జూనియర్‌ దళపతి బర్త్‌డే! | - | Sakshi
Sakshi News home page

జూలో జూనియర్‌ దళపతి బర్త్‌డే!

Nov 28 2026 1:38 AM | Updated on Nov 28 2026 1:38 AM

● ఎనిమిదేళ్లు పూర్తి.. ● పండ్లు, కూరగాయలతో అలంకరణ ● చిన్నారుల మధ్య కేక్‌ కట్‌ చేసి సంబరాలు

ఆరిలోవ: దళపతి.. పేరు వినగానే సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమా గుర్తుకొస్తుందా? అయితే ఇక్కడ సినిమా కాదు.. వెండి తెర హీరో కాదు.. ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలలో సందడి చేస్తున్న ఓ నీటి ఏనుగు. జూలోనే పుట్టి పెరిగిన జూనియర్‌ దళపతి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుని తొమ్మిదో ఏట అడుగుపెట్టింది. ఈ సందర్భంగా శుక్రవారం జూ అధికారులు చిన్నారుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.

తండ్రి జ్ఞాపకార్థంగా..

2018 నవంబరు 27న జూలోని పద్మ, దళపతి అనే నీటి ఏనుగుల జతకు మగ పిల్ల జన్మించింది. అయితే, కొద్ది రోజులకే తండ్రి ఏనుగు దళపతి అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో తండ్రి జ్ఞాపకార్థం ఆ పిల్లకు జూనియర్‌ దళపతి అని పేరు పెట్టారు. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా నీటి ఏనుగుల ఎన్‌క్లోజర్‌ను పండ్లు, కూరగాయలతో అలంకరించారు. పాఠశాల విద్యార్థుల సమక్షంలో క్యూరేటర్‌ జి.మంగమ్మ, అధికారులు కేక్‌ కట్‌ చేసి దళపతికి పండ్లు తినిపించారు.

దత్తతకు ముందుకొచ్చిన విద్యాసంస్థలు

వేడుకల సందర్భంగా సీపీఈ కళాశాల యాజమాన్యం జూనియర్‌ దళపతిని మూడు నెలలపాటు దత్తత తీసుకుంది. ఇందుకోసం రూ.40 వేల విరాళాన్ని జూ క్యూరేటర్‌కు అందజేసింది. అలాగే, అనకాపల్లి జిల్లా యలమంచిలిలోని సెయింట్‌ జూడ్స్‌ ది ఫ్రెంచ్‌ ఆరిజన్‌ స్కూల్‌ యాజమాన్యం జూలోని ఆసియాటిక్‌ అడవి కుక్కను ఏడాది పాటు దత్తత తీసుకుని, రూ.50 వేల విరాళం అందించింది. కార్యక్రమంలో ఆయా విద్యాసంస్థల ప్రతినిధులు, జూ అసిస్టెంట్‌ క్యూరేటర్‌ గోపి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement