గంభీరంలో ప్రజాస్వామ్యానికి గొంతుకోత! | - | Sakshi
Sakshi News home page

గంభీరంలో ప్రజాస్వామ్యానికి గొంతుకోత!

Nov 28 2026 1:38 AM | Updated on Nov 28 2026 1:38 AM

కూటమి అభ్యర్థి కోసం

ఆర్‌వో నిబంధనల ఉల్లంఘన

ఒక నామినేషన్‌ ఉపసంహరణకు

అంగీకరించి.. మరోదానిపై మెలిక

రశీదును జేబులో పెట్టుకున్న ఆర్‌వో..

తీసుకెళ్లిన కూటమి నేత

నిమిషాల్లోనే ఏకగ్రీవమంటూ

ఏకపక్ష ప్రకటన

ఎన్నికల అధికారుల తీరుపై

వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఆగ్రహం

నిరసన తెలుపుతున్న

మద్దతుదారులు

సాక్షి, విశాఖపట్నం: ఎన్నికలంటే ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ప్రక్రియ. కానీ ఆనందపురం మండలం గంభీరం పంచాయతీలో సర్పంచ్‌ ఎన్నికల వ్యవహారం ఇందుకు భిన్నంగా సాగింది. కూటమి మద్దతుదారుడిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్నికల అధికారులే నిబంధనలను పక్కనపెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక నామినేషన్‌ ఉపసంహరణకు అంగీకరించి, మరో నామినేషన్‌ కొనసాగుతుందని హామీ ఇచ్చిన స్టేజ్‌–1 రిటర్నింగ్‌ అధికారి (ఆర్‌వో).. ఆ తర్వాత మాట మార్చడం, ఉపసంహరణ రశీదు ఆయన జేబులో పెట్టకోవడం.. అక్కడికి వచ్చిన కూటమి నేత దానిని తీసుకుని వెళ్లిపోవడం.. ఆ వెంటనే కూటమి అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవమైందంటూ ప్రకటించడం.. ఇలా కొద్దిసేపటి వ్యవధిలోనే అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

రెండు సెట్లు వేస్తే.. ఒకదానికే ఉపసంహరణ

గంభీరం సర్పంచ్‌ పదవికి వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు బోయి వెంకటరమణ తన పేరుతో రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఒకటి ‘బోయి వెంకటరమణ’ పేరుతో, మరొకటి ‘వెంకటరమణ బోయి’ పేరుతో సమర్పించారు. ముందుజాగ్రత్తగా తన కుమారుడి పేరుతోనూ మరో నామినేషన్‌ వేశారు. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో ఆర్‌వో ఆయనను పిలిచి, కుమారుడి నామినేషన్‌తోపాటు తన పేరుతో ఉన్న రెండు సెట్లలో ఒకదానిని ఉపసంహరించుకోవాలని సూచించారు. ఒకే అభ్యర్థి పేరుతో రెండు నామినేషన్లు ఉంటే సాంకేతిక కారణాలతో రెండూ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని నమ్మించారు. దీంతో ఆర్‌వో సూచన మేరకు వెంకటరమణ ఒక సెట్‌ను ఉపసంహరించుకుంటూ సంతకం చేశారు. అందుకు సంబంధించిన రశీదును కూడా ఆర్‌వో అందజేశారు. రెండో సెట్‌ నామినేషన్‌ కొనసాగుతుందని, ఎన్నికల బరిలో ఉండవచ్చని స్పష్టం చేశారు.

రశీదు మాయం.. ఆ వెంటనే ఏకగ్రీవం

కార్యాలయం నుంచి బయటకు వచ్చిన వెంకటరమణకు కొద్దిసేపటికే ఆర్‌వో ఫోన్‌ చేసి రశీదుతో తిరిగి రావాలని కోరారు. ఆయన వెళ్లగానే రశీదును తీసుకుని ఆర్‌వో తన చొక్కా జేబులో పెట్టుకున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన కూటమి మద్దతుదారుడు వానపల్లి ముత్యాలరావు ఆ రశీదును తీసుకుని వెళ్లిపోయారని వెంకటరమణ ఆరోపించారు. తన కళ్లముందే ఇదంతా జరుగుతున్నా ఆర్‌వో అడ్డుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన అనంతరం ఆర్‌వో మాట మార్చి, కలెక్టర్‌, ఆర్‌డీవోతో మాట్లాడానని, రెండో నామినేషన్‌ కూడా కొనసాగడానికి వీల్లేదని చెప్పినట్లు వెంకటరమణ తెలిపారు. ఒక నామినేషన్‌ మాత్రమే ఉపసంహరించుకున్నానని, రెండోది కొనసాగుతుందని హామీ ఇచ్చారని నిలదీసినా స్పందించలేదన్నారు. చివరకు వానపల్లి ముత్యాలరావు ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ప్రకటించారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా కలెక్టర్‌ సమగ్ర విచారణ జరిపి, నామినేషన్లు, ఉపసంహరణ రికార్డులను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement