కేజీహెచ్‌లో కీచకుడు! | - | Sakshi
Sakshi News home page

కేజీహెచ్‌లో కీచకుడు!

Nov 28 2026 1:38 AM | Updated on Nov 28 2026 1:38 AM

● కేజీహెచ్‌ సెక్యూరిటీ ఇన్‌చార్జిపై మహిళా గార్డుల ఫిర్యాదులు

● లైంగికంగా వేధిస్తున్నారంటూ బాధితుల ఆవేదన

● ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఆసుపత్రి ఉన్నతాధికారులు

● బాధితుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అధికారుల వ్యాఖ్యలు

● మహిళా వైద్యులనూ వేధించినట్లు ఆరోపణలు

● ఆధారాలతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా కానరాని న్యాయం

సాక్షి, విశాఖపట్నం: కేజీహెచ్‌లో మహిళా ఉద్యోగుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఆసుపత్రికి వచ్చే రోగులు, సిబ్బందికి రక్షణ కల్పించాల్సిన సెక్యూరిటీ విభాగంలోనే మహిళా గార్డులకు వేధింపులు ఎదురవుతున్నాయనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. సెక్యూరిటీ విభాగం ఇన్‌చార్జి తమను లైంగికంగా వేధిస్తున్నారని మహిళా గార్డులు ఆరోపిస్తున్నారు. సదరు వ్యక్తి నుంచి జూనియర్‌, సీనియర్‌ మహిళా వైద్యులకూ వేధింపులు ఎదురైనట్లు బాధితులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా, తమ వ్యక్తిత్వాన్నే కించపరిచేలా మాట్లాడారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు ఆధారాలతో సహా జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించినా ఇప్పటికీ న్యాయం జరగలేదని వాపోతున్నారు.

ఫిర్యాదు చేసినా వేధింపులే..

కేజీహెచ్‌లో గత కొద్ది నెలలుగా సెక్యూరిటీ ఇన్‌చార్జి వేధింపులు కొనసాగుతున్నాయని బాధిత మహిళా గార్డులు చెబుతున్నారు. తొలుత ఈ విషయాన్ని ఆసుపత్రి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన కరువైందని ఆరోపిస్తున్నారు. ఇలాంటి విషయాలను బయటకు చెప్పకూడదని, ఫిర్యాదులు చేయవద్దని చెప్పి తమను వెనక్కి పంపించేశారని వాపోతున్నారు. మరోవైపు, ఫిర్యాదు చేస్తారా అంటూ సదరు ఇన్‌చార్జి మరింతగా వేధించడం ప్రారంభించారని పేర్కొంటున్నారు. దీంతో బాధిత మహిళ తన తల్లితో కలిసి మరోసారి ఉన్నతాధికారులను ఆశ్రయించారు. అయితే న్యాయం చేయాల్సిన అధికారులే తమను అవమానించేలా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘మీరే క్యారెక్టర్‌ లేని మనుషులు.. ఇతరుల క్యారెక్టర్‌ గురించి ఫిర్యాదు చేయడమేంటి?’ అంటూ వ్యాఖ్యానించారని ఆరోపిస్తున్నారు. బాధ్యుడిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, బాధితులనే కించపరచడం తీవ్ర మానసిక వేదనకు గురిచేసిందని మహిళా గార్డులు చెబుతున్నారు.

సిబ్బంది కొరతతో అదనపు భారం

మరోవైపు కేజీహెచ్‌ సెక్యూరిటీ విభాగంలో సిబ్బంది కొరత కూడా మహిళా గార్డులకు సమస్యగా మారింది. మొత్తం 284 మంది సెక్యూరిటీ సిబ్బంది అవసరం ఉండగా, ప్రస్తుతం సుమారు 230 నుంచి 240 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అందుబాటులో ఉన్న సిబ్బందిపై అదనపు పని భారం పడుతోంది. సెలవులు పెట్టిన సందర్భాల్లో ప్రత్యామ్నాయ సిబ్బందిని ఏర్పాటు చేయకుండా విధులకు హాజరుకావాలని ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే పని ఒత్తిడితో ఇబ్బందులు పడుతున్న మహిళా గార్డులకు వేధింపులు, వేతనాల సమస్యలు మరింత భారంగా మారాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ నేరుగా జోక్యం చేసుకుని మహిళా గార్డుల వేధింపుల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని బాధితులు కోరుతున్నారు.

ఆధారాలతో కలెక్టర్‌కు ఫిర్యాదు

కేజీహెచ్‌ ఉన్నతాధికారుల నుంచి స్పందన లేకపోవడంతో బాధిత మహిళా సెక్యూరిటీ గార్డులు ఆధారాలతో సహా కలెక్టర్‌ను ఆశ్రయించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. ప్రైవేట్‌ సెక్యూరిటీ ఏజెన్సీ ప్రతినిధి అనుచిత ప్రవర్తన, వేధింపులు, దుర్భాషలతోపాటు వేతనాల చెల్లింపులో జాప్యం, ఇతర సర్వీసు సమస్యలపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయం.. ఆసుపత్రి కమిటీ ద్వారా విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని బాధితులకు ఎండార్స్‌మెంట్‌ జారీ చేసింది. అనంతరం అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ) విచారణకు హాజరుకావాలని ఫిర్యాదుదారులు, సెక్యూరిటీ ఏజెన్సీ ప్రతినిధి, సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. అయితే విచారణ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ, క్షేత్రస్థాయిలో వేధింపుల వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు చేసి ఇంతకాలమైనా తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సెక్యూరిటీ ఇన్‌చార్జిపై కొందరు మహిళా వైద్యులు కూడా వేధింపుల ఆరోపణలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఈ ఫిర్యాదులపైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement