విశాఖ విద్య: గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైన కొండల విధ్వంసం కూటమి నేతల అండతో నగరానికీ తాకింది. జీవీఎంసీ 101వ వార్డు పరిధిలోని మంగళపాలెంలో నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా కొండలను తవ్వేస్తున్నారు. గ్రావెల్‌ను అక్రమంగా తరలించి నాలుగు ‘రాళ్లు’వెనకేసుకుంటున్నారు. ఒకచోట అనుమతులు పొంది, మరోచోట తవ్వకాలు సాగిస్తున్నా అధికార యంత్రాంగం కిమ్మనకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అనుమతి ఒకచోట.. తవ్వకాలు మరోచోట
సబ్బవరం మండలం సర్వే నంబర్ 142లో తవ్వకాలకు అనుమతులు తీసుకున్న వ్యక్తులు, నిబంధనలకు విరుద్ధంగా మంగళపాలెం సర్వే నంబర్ 155లోని కొండను తవ్వి గ్రావెల్‌ను తరలిస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గత వారం రోజులుగా రాత్రింబవళ్లు తేడా లేకుండా ఈ దందా కొనసాగుతోంది. మైనింగ్ చట్టం ప్రకారం జనావాసాలకు 100 మీటర్ల పరిధిలో ఎలాంటి తవ్వకాలు చేపట్టరాదు. కానీ, ఇక్కడ జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీకి ఆనుకుని, వాటర్ ట్యాంకులు, ప్రార్థనా స్థలాలకు అత్యంత సమీపంలోనే భారీ యంత్రాలతో కొండను తొలిచేస్తున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యారు.
కూటమి నేతల అండదండలు
ఈ అక్రమ తవ్వకాల వెనుక కూటమి నేతల హస్తం ఉందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నిబంధనలను బేఖాతరు చేస్తున్న గ్రావెల్ మాఫియాకు టీడీపీ ముఖ్య నేతలు, స్థానిక కార్పొరేటర్ అండగా నిలుస్తున్నారన్నది బహిరంగ రహస్యం. అధికార బలంతో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. తవ్వకాలను ప్రశ్నించిన వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికార యంత్రాంగం మౌనవ్రతం
కళ్ల ముందే ప్రకృతి సంపద లూటీ అవుతున్నా గాజువాక రెవెన్యూ, పోలీస్ అధికారులు కనీస స్పందన లేకుండా వ్యవహరిస్తున్నారు. అక్రమ తవ్వకాలపై స్థానికులు పలుమార్లు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినా, అదిగో, ఇదిగో.. అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప క్షేత్రస్థాయికి వచ్చి అడ్డుకున్న దాఖలాలు లేవు. ప్రభుత్వ స్థలాలు, కొండలు ఆక్రమణలకు గురవుతుంటే అడ్డుకోవాల్సిన రెవెన్యూ, శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీస్ యంత్రాంగాలు మాఫియాకు కొమ్ముకాస్తూ ప్రేక్షకపాత్ర పోషిస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చర్యలు తీసుకోకపోతే
ఆందోళన: వైఎస్సార్‌సీపీ
కొండల విధ్వంసంపై అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వైఎస్సార్‌సీపీ 101వ వార్డు అధ్యక్షుడు బొడ్డ గోవింద్ హెచ్చరించారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీ సమీపంలో జరుగుతున్న ఈ అక్రమ తవ్వకాలపై స్థానికులు తమ దృష్టికి తీసుకురాగా, విషయాన్ని గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డికి వివరించినట్లు తెలిపారు. ప్రకృతి వనరుల దోపిడీ నగరంలోకి కూడా ప్రవేశించడం ఆందోళనకరమన్నారు. జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


