రౌడీస్‌ ఆన్‌ డ్యూటీ ..! | - | Sakshi
Sakshi News home page

రౌడీస్‌ ఆన్‌ డ్యూటీ ..!

Nov 1 2026 12:27 AM | Updated on Nov 1 2026 12:27 AM

నేతల అండతో రౌడీ షీటర్ల బరితెగింపు

తమ అభ్యర్థులకే ఓటు వేయాలని బెదిరింపులు?

వీరి కనుసన్నల్లోనే డబ్బు, మద్యం అక్రమ పంపిణీ ?

ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకే నిబంధనలు ?

చోద్యం చూస్తున్న పోలీసులు

ద్వారకా నగర్‌: స్థానిక ఎన్నికలలో కూటమి తరఫున రౌడీలు వకాల్తా పుచ్చుకుని రాజకీయ ముసుగులో చేస్తున్న అరాచకాలపై స్పందించని పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలపై నిబంధనల పేరుతో విరుచుకుపడుతున్న తీరుపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలోని పలు వార్డుల్లో బెదిరింపులు, ప్రలోభాలకు రౌడీ గ్యాంగులు పాల్పడుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికల అవసరాల కోసం కొందరు నేతలు రౌడీ గ్యాంగులను చేరదీసి, వారికి ఆశ్రయం కల్పించారనే ఆరోపణలు ఉన్నాయి. రోజువారీ జీతభత్యాలతో పాటు మందు, విందు సౌకర్యాలు కూడా కల్పిస్తుండటంతో రౌడీషీటర్లు రాజకీయ పార్టీల శిబిరాలను వీడడం లేదు. కూటమి నాయకుల కనుసన్నల్లోనే అక్రమంగా పంపిణీ చేసే డబ్బు, మద్యం ఈ రౌడీ గ్యాంగుల ద్వారానే ఆయా వార్డుల్లో ప్రజలకు చేరుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

పోలీసుల చర్యలు శూన్యం

విశాఖ గ్రేటర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా విశాఖ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినప్పటికీ, ఫలితం మాత్రం శూన్యమంటూ పలువురు ఎద్దేవా చేస్తున్నారు. కూటమి అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరిస్తూ, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు నిబంధనల పేరుతో ఇబ్బందులు కలిగిస్తున్నారనే ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. దీనికి తోడు రౌడీషీటర్ల హడావుడి కూడా పెరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఓటర్లకు బెదిరింపులు..

తాము పనిచేస్తున్న పార్టీ నేతలకే ఓట్లు వేయాలని రౌడీలు ప్రజలను దమాయించి బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ పోలీసులు, ప్రభుత్వ ఎన్నికల యంత్రాంగం దృష్టికి రాకుండా చాపకింద నీరులా సాగుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో రాజకీయ నాయకుల నుంచి అందినకాడికి వేలల్లో, లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కొందరు రౌడీషీటర్ల విషయంలో పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ నేతల అండదండలు ఉన్న వారిపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు వెనుకడుగు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రౌడీషీటర్ల కదలికలపై నిరంతర నిఘా, చట్టపరమైన చర్యలు కొనసాగాల్సిన అవసరం ఉంది. అయితే రాజకీయ నేతలతో సన్నిహితంగా తిరుగుతున్న వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

రంగంలో 847 మంది రౌడీ షీటర్లు

నగరంలో రౌడీషీటర్ల కదలికలు కలవరపెడుతున్నాయి. విశాఖ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 933 మంది రౌడీషీటర్లు ఉండగా, వారిలో 86 మంది ప్రస్తుతం జైళ్లలో ఉన్నారు. మిగిలిన 847 మంది నగరంలోనే ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వీరి కదలికలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు బైండోవర్‌ చర్యలు చేపడుతున్నప్పటికీ, కొందరు రాజకీయ నేతల అండదండలతో ఎన్నికల వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేరచరిత్ర ఉన్న వ్యక్తులు ఎన్నికల వేళ రాజకీయ శక్తులుగా మారితే ప్రజాస్వామ్యానికి, ప్రజల భద్రతకు ముప్పు తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement