డాబాగార్డెన్స్: ప్రతి ఓటరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, జీవీఎంసీ కమిషనర్, అదనపు ఎన్నికల అధికారి కేతన్‌గార్గ్ పిలుపునిచ్చారు. ఎలాంటి ప్రలోభాలు, ఒత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటేయాలని సూచించారు. జీవీఎంసీ ఎన్నికల నిర్వహణపై సమీక్షించిన ఆయన, శనివారం పది జోన్లలోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ సజావుగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ బాధ్యతతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. పోలింగ్ సమయంలో సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రెండు బ్యాలెట్లపై అవగాహన : మేయర్ ఎన్నికకు పింక్ రంగు బ్యాలెట్ పేపరు, వార్డు కార్పొరేటర్ ఎన్నికకు తెలుపు రంగు బ్యాలెట్ పేపరు వినియోగించనున్నట్లు కమిషనర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో ప్రిసైడింగ్ అధికారులు బ్యాలెట్ పేపర్లను మడతపెట్టి బ్యాలెట్ బాక్సుల్లో వేసే విధానాన్ని వివరిస్తారని చెప్పారు. ఎన్నికలకు సంబంధించి సమస్యలు, ఫిర్యాదులు ఉంటే టోల్‌ఫ్రీ నంబరు 1800 4250 0009కు ఫోన్ చేయాలని కేతన్‌గార్గ్ సూచించారు.


