మేయర్ పీఠానికి 15 మంది ● 120 వార్డుల్లో 573 మంది అభ్యర్థులు పోటీ 18.37 లక్షల మంది ఓటర్లు ● 1,990 పోలింగ్ కేంద్రాలు సిద్ధం
సమయం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు..
సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మేయర్ పీఠం కోసం 15 మంది అభ్యర్థులు, 120 వార్డుల్లో కార్పొరేటర్ స్థానాల కోసం 573 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 18,37,901 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నెల 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
మేయర్ పీఠానికి 15 మంది పోరు
గ్రేటర్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వైఎస్సార్‌సీపీ తరఫున వరుదు కల్యాణి, కాంగ్రెస్ నుంచి దేవర నాగసునందాదేవి, టీడీపీ నుంచి ముక్కా శ్రావణి, బీఎస్పీ నుంచి కరణం కీర్తన గ్రేస్, భారత చైతన్య యువజన పార్టీ నుంచి నమ్మి భవాని పోటీ చేస్తున్నారు. మిగిలిన అభ్యర్థులు స్వతంత్రులుగా బరిలో ఉన్నారు.
రెండు బ్యాలెట్ పత్రాలు.. రెండు ఓట్లు
ఈ ఎన్నికల్లో మేయర్‌ను ప్రజలు నేరుగా ఎన్నుకునే విధానం అమల్లో ఉండటంతో ప్రతి ఓటరు రెండు బ్యాలెట్ పత్రాలపై ఓటు వేయాల్సి ఉంటుంది. మేయర్ అభ్యర్థికి గులాబీ రంగు, వార్డు కార్పొరేటర్ అభ్యర్థికి తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలను కేటాయించారు.
భారీ బందోబస్తు.. 14,334 మంది సిబ్బంది
ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు 4,500 మందికి పైగా పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియ నిర్వహణకు 14,334 మంది సిబ్బందిని నియమించారు. వీరితోపాటు 82 మంది రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, 56 మంది మాస్టర్ ట్రైనర్లు, 95 మంది నోడల్, సహాయ అధికారులు, 201 మంది రూట్ అధికారులు, 61 మంది సెక్టార్ అధికారులు, 10 మంది జోనల్ స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. ఎన్నికల పర్యవేక్షణకు 379 మంది మైక్రో అబ్జర్వర్లు, 21 ఎన్నికల ఖర్చుల పరిశీలక బృందాలు, 11 ఎంసీసీ బృందాలు, 11 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 20 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, రెండు వీడియో వ్యూయింగ్ బృందాలను ఏర్పాటు చేశారు.
ఎన్నికల సామగ్రి పంపిణీ పూర్తి
పోలింగ్‌కు అవసరమైన ఎన్నికల సామగ్రిని శనివారం ఉదయం జీవీఎంసీ పరిధిలోని 10 జోన్లలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాల ద్వారా సిబ్బందికి అందజేశారు. ప్రతి కేంద్రంలో రిజిస్ట్రేషన్ కేంద్రం, పీఓ/ఏపీఓ కౌంటర్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, పోలీసు కౌంటర్, ఆహార పంపిణీ కౌంటర్ తదితర ఏర్పాట్లు చేశారు.
మీ ఓటు ఎక్కడుందంటే..
ఓటర్లు తమ ఓటు వివరాలు, వార్డు, పోలింగ్ కేంద్రం నంబరు, చిరునామా తెలుసుకునేందుకు జీవీఎంసీ అధికారిక వెబ్‌సైట్ (www.gvmc. gov.in) (http://www.gvmc. gov. in)ను సందర్శించవచ్చు.
జోన్లు వార్డులు ఓటర్లు పోలింగ్
కేంద్రాలు
భీమిలి 1–5 66,446 78
మధురవాడ 6–11, 120 1,49,452 162
తూర్పు 12–29 2,96,124 309
దక్షిణ 30–45 2,17,817 249
ఉత్తర 46–65 2,91,692 302
పశ్చిమ 66–82 2,22,029 245
గాజువాక 83–101 2,98,228 329
అగనంపూడి 102–106 69,796 75
అనకాపల్లి 107–112 76,950 89
పెందుర్తి 113–119 1,49,367 152
120 వార్డులు.. 573 మంది అభ్యర్థులు


