పోలింగ్ డే అంటే సెలవు కాదు.. ప్రజాస్వామ్య బాధ్యత
ఆరు ఎన్నికల్లో ఒక్కసారే 70 శాతం దాటిన పోలింగ్
ఐదు ఎన్నికల్లోనూ 60 శాతంలోపే ఓటింగ్
1995లో అత్యల్పంగా 49.02 శాతం నమోదు
2021లోనూ ఓటు వేయని వారు 7 లక్షల మందికి పైనే..
ఈసారైనా నిర్లక్ష్యానికిస్వస్తి పలుకుతారా?
సాక్షి, విశాఖపట్నం: నగర భవిష్యత్తును నిర్ణయించే ఓటు హక్కు వినియోగంలో విశాఖ ఓటర్లు ఎందుకు వెనుకబడుతున్నారు? ఎన్నికలొచ్చినప్పుడు చర్చలు.. సోషల్ మీడియాలో రాజకీయాలపై విశ్లేషణలు.. నగర సమస్యలపై ఆగ్రహావేశాలు.. కానీ ఓటు వేసే సమయానికి మాత్రం నిర్లక్ష్యం! గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే కనిపిస్తున్న విరుద్ధ చిత్రమిది. ఆరు ఎన్నికల్లో ఒక్కసారి మాత్రమే 70 శాతం పోలింగ్ నమోదైంది. ఐదు ఎన్నికల్లో ఓటింగ్ శాతం 60 దాటలేదు. నగర పాలనపై అసంతృప్తి వ్యక్తం చేసేవారిలోనూ ఓటు హక్కు వినియోగంపై నిర్లిప్తత కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈసారైనా ఓటర్లు మౌనం వీడి పోలింగ్ కేంద్రాల బాట పడతారా? నగర భవిష్యత్తును నిర్ణయించే బాధ్యతను భుజానికెత్తుకుంటారా?
ఆరు ఎన్నికలు.. మారని ఓటింగ్ తీరు
గ్రేటర్ విశాఖలో ఓటింగ్ శాతం పెరగకపోవడం ఒక్క ఎన్నికతో మొదలైన సమస్య కాదు. దశాబ్దాలుగా ఇదే ధోరణి కొనసాగుతోంది. 1981లో జరిగిన ఎన్నికల్లో 70.10 శాతం పోలింగ్ నమోదైంది. అదే అత్యధికం. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మాత్రం ఓటర్ల భాగస్వామ్యం ఆశించిన స్థాయికి చేరలేదు. 1987లో 56.83 శాతం, 1995లో 49.02 శాతం, 2000లో 49.63 శాతం, 2007లో 52.48 శాతం పోలింగ్ నమోదైంది. 2021లో కొంత మెరుగుదల కనిపించినా.. ఓటింగ్ శాతం 59.41కే పరిమితమైంది. అంటే, ఆరు ఎన్నికల్లో ఐదుసార్లు 60 శాతం మార్కును కూడా విశాఖ దాటలేకపోయింది.
ఏడు లక్షల మంది ఓటుకు దూరం
2021 ఎన్నికల గణాంకాలు నగర ఓటర్ల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. అప్పట్లో జీవీఎంసీ పరిధిలో 17,26,158 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 10,25,442 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. మిగిలిన 7,00,716 మంది ఓటు వేయలేదు. అంటే మొత్తం ఓటర్లలో సుమారు 40.59 శాతం మంది పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. మేయర్ పీఠాన్ని ఎవరు దక్కించుకుంటారన్న రాజకీయ పోటీ ఒకవైపు ఉంటే.. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎంతమంది భాగస్వాములవుతారన్న ప్రశ్న మరోవైపు నిలుస్తోంది.
ఓటు వేయకపోవడానికి సవాలక్ష సాకులు
‘నా ఒక్క ఓటుతో ఏమవుతుంది?’.. ‘ఒక్కరోజు సెలవు దొరికింది.. ఇంట్లోనే ఉంటా!’.. ‘పోలింగ్ కేంద్రంలో గంటల తరబడి వేచి ఉండాలా?’.. ‘ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో తెలియదు!’.. ఎన్నికల సమయంలో వినిపించే సమాధానాలివి. ఓటు హక్కు వినియోగించుకోకపోవడానికి ఒక్కొక్కరు ఒక్కో కారణం చెబుతున్నారు. కానీ ప్రతి ఓటూ విలువైనదే. పోటీ హోరాహోరీగా ఉన్నప్పుడు కొద్దిపాటి ఓట్ల తేడా కూడా ఫలితాన్ని మార్చగలదు. తమ సమస్యలపై పాలకులను ప్రశ్నించాలన్నా, నగర పాలనలో మార్పు కోరాలన్నా పౌరుల చేతిలో ఉన్న అత్యంత కీలకమైన ప్రజాస్వామ్య ఆయుధం ఓటు.
ప్రశ్నించేవారు.. ఓటేయడంలోనూ ముందుండాలి
రోడ్లు బాగోలేవని.. తాగునీరు రావడం లేదని.. డ్రైనేజీ సమస్యలు పరిష్కారం కావడం లేదని.. పారిశుధ్యం అధ్వానంగా ఉందని నగరవాసులు నిత్యం ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. పాలకుల పనితీరుపై అసంతృప్తి ఉన్నా.. తమ అభిప్రాయాన్ని ఓటు రూపంలో వ్యక్తం చేయకపోతే ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామ్యం అసంపూర్తిగానే మిగులుతుంది. ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఒక పార్టీకి మద్దతివ్వడమే కాదు.. తమ ప్రాంతానికి ఎలాంటి పాలన కావాలో నిర్ణయించుకోవడం. పోటీ చేసే అభ్యర్థుల పనితీరు, విశ్వసనీయత, నగర సమస్యలపై వారి వైఖరిని బేరీజు వేసుకుని ఓటు వేయడం ప్రతి పౌరుడి బాధ్యత.
ఈసారైనా గడప దాటుదాం!
గత ఎన్నికల గణాంకాలు ఒక హెచ్చరిక. నగర అభివృద్ధిపై ఆసక్తి చూపే పౌరులు ఓటు హక్కు వినియోగంలోనూ అదే చైతన్యం ప్రదర్శించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి. ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో ముందుగానే చూసుకోవడం.. పోలింగ్ కేంద్రం వివరాలు తెలుసుకోవడం.. ఎన్నికల రోజున ఓటు వేసేందుకు సమయం కేటాయించడం వంటి చిన్నచిన్న చర్యలతోనే పెద్ద మార్పుకు పునాది పడుతుంది. ఓటు వేయడం సెలవు దినంలో చేసే అదనపు పని కాదు.. పౌరుడిగా నిర్వర్తించాల్సిన కనీస బాధ్యత. నగర భవిష్యత్తును నిర్ణయించే అవకాశం వచ్చినప్పుడు నిర్లక్ష్యానికి తావివ్వకుండా ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వెళ్లాలి.


