ఓటు.. దొంగ నోటు.! | - | Sakshi
Sakshi News home page

ఓటు.. దొంగ నోటు.!

Nov 1 2026 12:39 AM | Updated on Nov 1 2026 12:39 AM

● పోలీసులకు చిక్కిన దొంగనోట్ల ముఠా ● ఎన్నికల వేళ కూటమి నేతల హస్తంపై అనుమానాలు ● ఓటర్లకు పంపిణీ చేసిన డబ్బుల్లోనూ దొంగనోట్లా? ● నకిలీ నోట్లున్నాయేమోనని ఉలిక్కిపడుతున్న ఓటర్లు

సాక్షి, విశాఖపట్నం: ఓటరు మహాశయా.. మీకెవరైనా ఓటరు స్లిప్పుతో పాటు డబ్బులిచ్చారా? నోట్లు కొత్తగా ఉన్నాయని మురిసిపోతున్నారా? అయితే జాగ్రత్త.. అందులో నకిలీ నోట్లున్నాయేమో.. ఒక్కసారి చెక్‌ చేసుకోండి సుమా! అభివృద్ధిని విస్మరించి.. విశాఖ నగరాన్ని విధ్వంసం చేస్తున్న కూటమి నేతలు.. ఎలాగైనా జీవీఎంసీ ఎన్నికల్లో గెలవాలని అడ్డదారులు తొక్కుతున్నారనే ఆరోపణలున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో హామీలతో మోసం చేసిన కూటమి ప్రభుత్వం.. గ్రేటర్‌ ఎన్నికల్లో డబ్బులతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చూస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు పంపిణీ చేసే డబ్బుల్లోనూ మోసం జరిగిందనే అనుమానాలు కలకలం రేపుతున్నాయి.

ఓటుకు.. దొంగ ‘నోట్లా?’

ఎన్నికలొచ్చాయంటే ఓటర్లకు పండగే! కానీ, ఆ పండగనూ ‘దొంగ’ క్యాష్‌ చేసుకుంటున్నారా? ఓటుకు నోటు ఇవ్వడం పాత ట్రెండ్‌.. ఇచ్చిన నోట్లలోనే నకిలీలు కలపడం కొత్త ట్రెండ్‌ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజుల క్రితం నగరంలో పట్టుబడ్డ నకిలీ కరెన్సీ ముఠా వ్యవహారం ఓటర్లలో గుబులు రేపుతోంది. కూటమి నేతలు ఇచ్చిన నోట్లలో ఏవి అసలో.. ఏవి నకిలీవోనని జనం ఆందోళన చెందుతున్నారు. జగదాంబ జంక్షన్‌ సమీపంలోని వీ–స్టార్‌ హోటల్‌లో పోలీసులు మెరుపు దాడి చేసి.. 105వ నంబర్‌ గదిలో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. లగేజీ బ్యాగులు తెరిచి చూడగా కట్టలకొద్దీ రూ.500 నోట్ల కలర్‌ జిరాక్స్‌ కాపీలు బయటపడ్డాయి. మొత్తం 200 కట్టల్లో.. ఒక్కో కట్టలో 66 కాపీల చొప్పున 13,200 కాపీలను గుర్తించినట్లు సమాచారం. వీటి ముఖ విలువ రూ.66 లక్షలు. దీంతో ఓటర్లకు పంపిణీ చేసిన డబ్బులపైనా అనుమానాలు మొదలయ్యాయి.

కూటమి నేతల హస్తం ఉందా?

ఎన్నికల వేళ ఈ ముఠా పట్టుబడటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం వెనుక కూటమి నేతల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఒక్కో ఓటుకు రూ.3 వేల చొప్పున పంపిణీ చేశారనే ప్రచారం సాగుతోంది. ఆ డబ్బుల్లో అసలు నోట్లతోపాటు నకిలీలను కలిపారనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. 7వ వార్డులో ఓ నాయకుడు తొలుత రూ.1,500 ఇచ్చి.. తర్వాత మరో రూ.700 ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఎందుకిలా అని అడిగితే.. తన వార్డు నంబర్‌ ఏడని, అదే తన సెంటిమెంట్‌ నంబర్‌ కావడంతో మరో రూ.700 ఇస్తున్నానని చెప్పినట్లు సమాచారం. ఇలా పలు చోట్ల జరిగిందనే చర్చ సాగుతోంది. నకిలీ నోట్ల వ్యవహారం బయటపడటంతో ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారు. డబ్బులు తీసుకుని మురిసిపోయిన జనం.. అవి నకిలీవేమోనని ఆందోళన చెందుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని డబ్బుతో కొనాలనుకోవడమే తప్పు.. అందులోనూ నకిలీ నోట్లతో మోసం చేశారనే అనుమానాలు మరింత కలకలం రేపుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement