వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు
మహారాణిపేట: జీవీఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ ఏర్పాట్లు పూర్తి చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్లను కోరారు.ఈ మేరకు అధికారులకు వినతిపత్రం సమర్పించిన ఆయన, సుప్రీంకోర్టు ఈ నెల 27న జారీ చేసిన ఆదేశాల ప్రకారం నామినేషన్ కేంద్రాలు, రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలు, పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాల్లో వీడియోగ్రఫీ, సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఎన్నికల పిటిషన్ల గడువు ముగిసే వరకు లేదా తుది పరిష్కారం జరిగే వరకు దృశ్యాలను భద్రపరచాలని ఆదేశాలు ఉన్నాయని తెలిపారు.జీవీఎంసీ పరిధిలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికీ సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ ఏర్పాట్లు పూర్తికాలేదని సమాచారం అందుతోం దన్నారు. పోలింగ్ ప్రారంభానికి ముందే ప్రతి కేంద్రంలో కెమెరాలు ఏర్పాటు చేసి, ప్రవేశ ద్వారాలు, బ్యాలెట్ బాక్సుల ప్రాంతాలను పర్యవేక్షణలో ఉంచాలని కోరారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో లైవ్ వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయాలని, పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సుల సీలింగ్, తరలింపు ప్రక్రియను రికార్డు చేయాలని సూచించారు. నవంబర్ 3న జరిగే ఓట్ల లెక్కింపు లోనూ కౌంటింగ్ ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించాలని కోరారు.ఎన్నికల పారదర్శకత, ఓటర్ల స్వేచ్ఛను కాపాడేందుకు అధికారులు ఈ అంశాన్ని అత్యవసరంగా పరిగణించాలని కేకే రాజు విజ్ఞప్తి చేశారు.


