పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

Oct 1 2026 9:27 AM | Updated on Oct 1 2026 9:27 AM

జీవీఎంసీ కాంట్రాక్టర్ల నిరసన

బీచ్‌రోడ్డు: జీవీఎంసీ పరిధిలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయి బిల్లులను వెంటనే చెల్లించాలని గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కాంట్రాక్టర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ సెంట్రల్‌ పార్క్‌ సమీపంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద బుధవారం కాంట్రాక్టర్లు నిరసన చేపట్టారు. నగర అభివృద్ధి పనులకు నిరంతరం సహకరిస్తున్న స్థానిక కాంట్రాక్టర్లు నెలల తరబడి బిల్లులు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అసోసియేషన్‌ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.

పనుల కోసం పెట్టుబడులు పెట్టి, వాటికి వడ్డీలు చెల్లించలేక కాంట్రాక్టర్లు, వారి కుటుంబాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు. నిధి పోర్టల్‌లో జనవరి 2027 నాటి బిల్లులను నమోదు చేయడంతోపాటు ఇప్పటికే పూర్తయిన పనులకు సంబంధించిన బిల్లులను ఎలాంటి ఆంక్షలు లేకుండా జీవీఎంసీ సాధారణ నిధుల నుంచి వెంటనే చెల్లించే ప్రక్రియ చేపట్టాలని కోరారు. బిల్లుల చెల్లింపులో పారదర్శకత పాటించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే స్థానిక కాంట్రాక్టర్ల ఉపాధిని దెబ్బతీసేలా పెద్ద ప్యాకేజీల విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. గతంలో మాదిరిగా పనులను చిన్న ప్యాకేజీలుగా విభజించి స్థానిక కాంట్రాక్టర్లకు అవకాశం కల్పించాలని కోరారు. కాంట్రాక్టర్ల న్యాయమైన డిమాండ్లను మానవతా దృక్పథంతో పరిశీలించి, సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని అసోసియేషన్‌ విజ్ఞప్తి చేసింది. డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించింది. కార్యక్రమంలో అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షులు టి.వీరారెడ్డి, ఆర్‌.వి. రమణారావు, అధ్యక్షులు పి.వి.వి. నాగరాజు, జనరల్‌ సెక్రెటరీ ఎం.సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement