జోన్‌ మనకు.. రైళ్లు వారికి! | - | Sakshi
Sakshi News home page

జోన్‌ మనకు.. రైళ్లు వారికి!

Oct 1 2026 9:27 AM | Updated on Oct 1 2026 9:27 AM

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ వచ్చి వంద రోజులు దాటినా మారని పరిస్థితి విశాఖ కేంద్రంగా ఒక్క కొత్త రెగ్యులర్‌ రైలుకూ నోచుకోని వైనం పిట్‌ లైన్లు, ట్రాక్‌లు లేవంటూ సాకులు చెబుతున్న డివిజన్‌ అధికారులు దువ్వాడ బైపాస్‌ మీదుగానే వెళ్లిపోతున్న స్పెషల్‌ రైళ్లు స్పెషల్‌ రైళ్లకూ ట్రాక్‌లు లేవంటూ నిర్లక్ష్యం వహిస్తున్న విశాఖ డివిజన్‌

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ వచ్చి వంద రోజులు దాటినా మారని పరిస్థితి విశాఖ కేంద్రంగా ఒక్క కొత్త రెగ్యులర్‌ రైలుకూ నోచుకోని వైనం పిట్‌ లైన్లు, ట్రాక్‌లు లేవంటూ సాకులు చెబుతున్న డివిజన్‌ అధికారులు దువ్వాడ బైపాస్‌ మీదుగానే వెళ్లిపోతున్న స్పెషల్‌ రైళ్లు స్పెషల్‌ రైళ్లకూ ట్రాక్‌లు లేవంటూ నిర్లక్ష్యం వహిస్తున్న విశాఖ డివిజన్‌

సాక్షి, విశాఖపట్నం: దశాబ్దాల చిరకాల స్వప్నం నెరవేరి, దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ అవతరించి వంద రోజులు గడిచిపోయాయి. విశాఖ కేంద్రంగా రైలు సర్వీసుల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని, ప్రయాణ కష్టాలు తీరుతాయని అంతా ఆశించారు. కానీ ఆ ఆశలన్నీ అడియాసలే అయ్యాయి. ‘జోన్‌ మనకి.. రైళ్లు పక్కోళ్లకు’ అన్న చందంగా ఇక్కడి పరిస్థితి తయారైంది. విశాఖ రైల్వే డివిజన్‌ అధికారుల నిర్లక్ష్యం, సాకుల కారణంగా కొత్త రెగ్యులర్‌ రైళ్లు పట్టాలెక్కకపోగా, ఇతర జోన్ల నుంచి వచ్చే స్పెషల్‌ రైళ్లు కూడా విశాఖ వైపు చూడకుండా బైపాస్‌ మీదుగానే వెళ్లిపోతున్నాయి. పిట్‌ లైన్లలో స్థలం లేదనే నెపంతో అధికారులు ప్రయాణికుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు.

చెబుతున్నవన్నీ సాకులే..

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు విశాఖపట్నం హెడ్‌క్వార్టర్స్‌ అయినప్పటికీ, ఇక్కడి నుంచి ఒక్క కొత్త రెగ్యులర్‌ రైలు కూడా ప్రారంభం కాలేదు. జోన్‌ ఏర్పాటుకు ముందే నడుస్తున్న కొన్ని స్పెషల్‌ రైళ్లను మాత్రమే అధికారులు రెగ్యులర్‌ చేశారు. అంతకుమించి కొత్త జోన్‌ పరిధిలో కొత్తగా హెడ్‌క్వార్టర్స్‌ నుంచి ఒక్క సర్వీస్‌ కూడా మొదలు కాలేదు. పిట్‌ లైన్లు నిండిపోయాయని, కొత్త రైళ్లకు స్లాట్లు ఖాళీ లేవంటూ విశాఖ రైల్వే డివిజన్‌ అధికారులు ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తున్నారు. సమస్యలను పరిష్కరించి కొత్త రైళ్లను తీసుకురావాలనే చిత్తశుద్ధి లోపించడంతో, జోన్‌ కేంద్రంగా విశాఖకు దక్కాల్సిన ప్రాధాన్యత రోజురోజుకీ కనుమరుగవుతోంది.

ఇతర జోన్లకు వరంగా మారిన నిర్లక్ష్యం!

విశాఖ డివిజన్‌ అధికారుల అలసత్వాన్ని పక్క రైల్వే జోన్లు తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి. దక్షిణ కోస్తా రైల్వే మీదుగా ఇతర జోన్లు అనేక ప్రత్యేక రైళ్లను ప్రవేశపెడుతున్నాయి. అయితే ఆ రైళ్లను నగరంలోకి తీసుకువచ్చేందుకు కూడా విశాఖ అధికారులు కనీస ఆసక్తి చూపడం లేదు. ట్రాక్‌లు ఖాళీ లేవనే కారణంతో ఆ రైళ్లన్నీ దువ్వాడ బైపాస్‌ మీదుగానే వెళ్లిపోతున్నాయి. ఫలితంగా నగర ప్రయాణికులకు ఆ సేవలు అందుబాటులోకి రావడం లేదు.

మన ట్రాక్‌పై పక్క జోన్ల రైళ్ల పరుగులు!

ప్రస్తుతం నడుస్తున్న పలు స్పెషల్‌ రైళ్ల వివరాలను పరిశీలిస్తే డివిజన్‌ అధికారుల తీరు స్పష్టమవుతోంది. శ్రీకాకుళం – చర్లపల్లి, సికింద్రాబాద్‌ – బరంపురం మధ్య నడుస్తున్న రెండు స్పెషల్‌ రైళ్లు దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. వీటితో పాటు బెంగళూరు వీక్లీ (18509/10), తిరుపతి వీక్లీ (18505/06, 18507/08), కొల్లాం వీక్లీ (18501/02), చర్లపల్లి వీక్లీ (18527/28) వంటి దాదాపు 10 రైళ్లు సదరన్‌, సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జోన్లకే పరిమితమయ్యాయి. మన జోన్‌ మీదుగా నడుస్తున్నా, స్థానిక అధికారుల చొరవ లేకపోవడంతో విశాఖ ప్రయాణికులకు ప్రయోజనం లేకుండా పోతోంది. ఈ రైళ్లు కూడా విశాఖ రైల్వేస్టేషన్‌కు రావడం లేదు.

ఉన్న రైళ్లకూ మంగళం!

కొత్త రైళ్లు రాకపోవడం ఒక ఎత్తయితే, ఏళ్ల తరబడి నడుస్తున్న పాత రైళ్లను సైతం అధికారులు రద్దు చేస్తుండటం ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. విశాఖ కేంద్రంగా కొత్త జోన్‌ వస్తే రైల్వే సర్వీసులు మెరుగుపడతాయని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. అధికారుల నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కేవలం కార్యాలయాలకు, కాగితాలకు, ఏసీ రూమ్‌లకే పరిమితమవుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement