ఆశలు ఆవిరి! | - | Sakshi
Sakshi News home page

ఆశలు ఆవిరి!

Oct 1 2026 9:27 AM | Updated on Oct 1 2026 9:27 AM

జిల్లాలో 42,438 మంది ఎదురుచూపులు ఇంకా పరిశీలనలోనే దరఖాస్తులు రెండేళ్ల నిరీక్షణకు ఇంకా పడని తెర

మహారాణిపేట: అక్టోబర్‌ 1.. కొత్త పింఛన్ల పంపిణీ అంటూ ఆశల పల్లకీ ఎక్కించిన చంద్రబాబు ప్రభుత్వం.. తీరా ఆ గడువు వచ్చేసరికి మాట మార్చి నిరుపేదల ఆశలపై నీళ్లు చల్లింది. దసరా నెలలో కొత్త పెన్షన్ల కోసం ఆశలు పెట్టుకున్న దరఖాస్తుదారులను నిరీక్షణలోకి నెట్టింది. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత స్థానిక సంస్థ ఎన్నికలకు నగారా మోగనున్న నేపథ్యంలో కొత్త పెన్షన్లకు హడావుడిగా స్వీకరించిన దరఖాస్తులు.. ఇంకా పరిశీలన దశలోనే ఉన్నాయంటూ చావు కబరు చల్లగా చెప్పింది.

జిల్లాలో 42,438 మంది దరఖాస్తులు

విశాఖ జిల్లాలో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ఈనెల 7 నుంచి 18వ తేదీ వరకు సాగింది. ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఒక అగ్నిపరీక్షలాగే సాగింది. మొదటి విడతలో సర్వర్లు మొరాయించడం, ఓటీపీలు గంటల తరబడి రాకపోవడంతో దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాంకేతిక సమస్యల పేరుతో అష్టకష్టాలు పడి దరఖాస్తులు సమర్పిస్తే.. చివరికి ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిరాశే మిగిలింది. జీవీఎంసీ, గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్‌డీఏ పర్యవేక్షణలో ఏకంగా 42,438 దరఖాస్తులు రాగా.. ఇందులో సగం వరకు వృద్ధాప్య పింఛన్ల దరఖాస్తులే ఉన్నాయి.

అక్టోబర్‌ 1న అని ఆశపెట్టి..

కొత్త పింఛన్‌కు దరఖాస్తులు చేసుకున్న వారికి అక్టోబర్‌ 1వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ చేసేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. కానీ సమయం వచ్చాక దరఖాస్తుల పరిశీలనే పూర్తి కాలేదని చెప్పి కొత్త పెన్షన్లను వాయిదా వేసింది. అయితే ఇప్పటి వరకు దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ఉత్తర్వులు జిల్లా యంత్రాంగానికి రాకపోవడం గమనార్హం. దీంతో దరఖాస్తులన్నీ సచివాలయాల్లోనే మూలుగుతున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల స్టంటేనా?

కేవలం త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల లబ్ధికే ఈ కంటితుడుపు కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త పెన్షన్‌ దరఖాస్తుల స్వీకరణకు రెండేళ్లు జాప్యం చేసి.. ఇప్పుడు వాటి పరిశీలనకు మరింత కాలయాపన చేస్తుండటం పట్ల నిరుపేదలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా రాజకీయ క్రీడలు కట్టిపెట్టి, అర్హులైన ప్రతి ఒక్కరికీ తక్షణమే పింఛన్లు మంజూరు చేయాలని కోరుతున్నారు.

పాత పింఛన్‌దారుల్లోనూ గుబులు!

కొత్త దరఖాస్తుల గోడు పక్కనపెడితే.. ప్రస్తుతం అమల్లో ఉన్న పాత పింఛన్‌దారుల గుండెల్లో గుబులు రేగుతోంది. జిల్లాలో ప్రస్తుతం అన్ని రకాలు కలిపి 1.56 లక్షల పింఛన్లు అమల్లో ఉన్నాయి. అయితే, కొత్తగా మరో 42 వేలకుపైగా దరఖాస్తులు రావడంతో.. ఆ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం ప్రస్తుతమున్న పింఛన్లలోనూ కోతలు పెడుతుందనే ప్రచారం తీవ్ర కలకలం రేపుతోంది. ఎక్కడ తమ పొట్ట కొడతుందో? ఎవరి పింఛన్‌ ఊడిపోతుందో? అని పెన్షన్‌దారులు బిక్కుబిక్కుమంటున్నారు.

కొత్త పింఛన్‌ దరఖాస్తులు ఇలా..

పింఛను రకం దరఖాస్తులు వృద్ధాప్య 21,275 వితంతు 12,761 దివ్యాంగులు 5,267 మత్స్యకారులు 1,593 గీతకార్మికులు 531 ఒంటరి మహిళలు 477 చర్మకారులు 201 డప్పు కళాకారులు 250 చేనేత కార్మికులు 54 ట్రాన్స్‌జెండర్స్‌ 29

కొత్త పింఛన్లు హుళక్కే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement