డీఆర్‌డీవో డైరెక్టర్ జనరల్
బాల మురళీకృష్ణన్
ఘనంగా డీఏడీ ప్లాటినం
జూబ్లీ వేడుకలు
గోపాలపట్నం: ప్రతిష్టాత్మక సంస్థలు విజయవంతంగా పనిచేయడంలో ఉద్యోగులు, అధికారుల సేవలే కీలకమని డీఆర్‌డీవో డైరెక్టర్ జనరల్, సీనియర్ సైంటిస్ట్ బాలమురళీకృష్ణన్ అన్నారు. డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్(డీఏడీ) ప్లాటినం జూబ్లీ(75 ఏళ్ల) ఉత్సవాలను ఎన్‌ఎస్‌టీఎల్ మానసి ఆడిటోరియంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాలమురళీకృష్ణన్ మాట్లాడుతూ.. విశాఖలో డీఏడీ 75 ఏళ్ల ఉత్సవాలు నిర్వహించుకుంటున్నప్పటికీ, ఈ సంస్థకు రెండు శతాబ్దాలకు పైగా చరిత్ర ఉందన్నారు. బ్రిటిష్ పాలనలో 1747లో సైనిక విభాగాల ఆర్థిక వ్యవహారాలు, ఖాతాల నిర్వహణ కోసం ఈ విభాగం ఏర్పాటైందని తెలిపారు. సంస్థలో తాము భాగస్వాములుగా ఉండటం గర్వకారణమన్నారు. దేశవ్యాప్తంగా డీఏడీకి 1,110 కార్యాలయాలు ఉండగా, విశాఖలోనే 15 కార్యాలయాలు ఉండటం రక్షణ రంగంలో నగరానికి ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తోందన్నారు.
కాలానుగుణంగా సేవల్లో మార్పులు
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డిఫెన్స్ అకౌంట్స్ విశాఖ విభాగం అధిపతి, ఐడీఏ, అడిషనల్ సీడీఏ బి.బాల జవహర్ మాట్లాడుతూ కాలానుగుణంగా డిఫెన్స్ అకౌంట్స్ నిర్వహణలో మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు. లైసెన్సింగ్ ఫీజుల వసూళ్లకు ‘ఈ–రక్షణ’విధానాన్ని అమల్లోకి తెచ్చామన్నారు. వారంలో ఏడు రోజులూ బిల్లుల క్లియరెన్స్ చేసే విధానాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా డీఏడీ ఉద్యోగుల కుటుంబ సభ్యులు, పిల్లలకు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. 30 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులతో పాటు జూనియర్ ఉద్యోగులకు మెమెంటోలు అందించారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్య రూపకాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌టీఎల్ డైరెక్టర్ అబ్రహం వర్గీస్‌తో పాటు డాక్టర్ వేణుగోపాల్, కె.సంగీత, ఐ.భార్గవ్, ఆనంద్ అచ్చుతాం కుట్టి, టి.రామమూర్తి తదితరులు పాల్గొన్నారు. బాల మురళీకృష్ణన్, అబ్రహం వర్గీస్‌లను ఘనంగా సత్కరించారు.


