అప్పన్న భూములకు రక్షణ కవచం | - | Sakshi
Sakshi News home page

అప్పన్న భూములకు రక్షణ కవచం

Oct 1 2026 9:27 AM | Updated on Oct 1 2026 9:27 AM

● రూ.2.5 కోట్లతో 7 కి.మీ ప్రహరీగోడలు ● 20 ఎకరాల్లో చందనం వనం ● ట్రస్ట్‌బోర్డు కీలక నిర్ణయాలు

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం భూముల పరిరక్షణ, క్షేత్ర అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యమిస్తూ సింహాచలం ట్రస్ట్‌బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేవస్థానం భూములకు రక్షణగా వివిధ ప్రాంతాల్లో రూ.2.50 కోట్లతో ఏడు కిలోమీటర్ల మేర ప్రహారీగోడలు నిర్మించేందుకు ఆమోదం తెలిపింది. స్వామివారికి అవసరమైన చందనాన్ని దేవస్థానమే సమకూర్చుకునేలా 20 ఎకరాల్లో చందనం చెట్ల పెంపకానికి పచ్చజెండా ఊపింది. దేవస్థానానికి చెందిన శ్రీకృష్ణాపురం గోశాలలో బుధవారం జరిగిన సమావేశంలో అజెండాలోని 63 అంశాలను ఆమోదించారు. అనువంశిక ధర్మకర్త, గోవా గవర్నర్‌ పూసపాటి అశోక్‌గజపతిరాజు గోవా నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈవో జల్లేపల్లి వెంకటరావు, ట్రస్ట్‌బోర్డు సభ్యులు, అధికారులు హాజరయ్యారు. ఆలయ దక్షిణ ప్రాకారం శిథిలావస్థకు చేరడంతో రూ.1.56 కోట్లతో నూతన ప్రాకారం, ప్రసాద్‌ పథకంలోని క్యూ కాంప్లెక్స్‌లో రూ.1.50 కోట్లతో స్టీల్‌ రైలింగ్‌ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. వార్షిక కల్యాణోత్సవం కోసం కొత్త రథం తయారీకి అనుమతించారు. గూగుల్‌ డేటా సెంటర్‌కు లీజుకిచ్చిన దేవస్థానం స్థలానికి వచ్చిన రూ.26.54 కోట్లతో పాటు 11 ఏళ్లలో లభించే సుమారు రూ.260 కోట్ల అద్దె ఆదాయానికి ఆదాయపన్ను మినహాయింపు కోరేందుకు ఆమోదం తెలిపారు. ఐటీ విభాగంలో ఇద్దరు ఇంజినీర్లను, పారిశుధ్య నిర్వహణకు 145 మంది సిబ్బందిని తీసుకునేందుకు అనుమతించారు. సింహగిరి ఘాట్‌రోడ్డు వ్యూపాయింట్‌ వద్ద రూ.30 లక్షలతో వసతులు, పాదాలమ్మ, బంగారమ్మ ఆలయాల వద్ద మరుగుదొడ్లు నిర్మించేందుకు నిర్ణయించారు. శ్రీదేవి కాంప్లెక్స్‌ హాళ్లు, పుష్కరిణి సత్రంలోని గదులు, మండపాలను అద్దెకు ఇవ్వడంతో పాటు ఆలయ మెట్ల మార్గాన్ని సుందరంగా తీర్చిదిద్దే పనులకు ఆమోదం తెలిపారు. భవిష్యత్తు నిర్మాణాలన్నీ సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌కు అనుగుణంగానే చేపట్టాలని బోర్డు నిర్ణయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement