దోపిడీ కేసులో కీలక మలుపు! | - | Sakshi
Sakshi News home page

దోపిడీ కేసులో కీలక మలుపు!

Oct 1 2026 9:27 AM | Updated on Oct 1 2026 9:27 AM

డాలర్ల మార్పిడి పేరుతో నయా మోసం

విజయవాడ రౌడీషీటర్‌ కీలక సూత్రధారి?

రూ.68 లక్షలు.. 10 తులాల బంగారం అపహరణ

నిందితుల అరెస్ట్‌.. దోపిడీ సొత్తు స్వాధీనం?

ద్వారకానగర్‌: డాలర్ల మార్పిడి పేరుతో బాధితులను నమ్మించి భారీగా నగదు, బంగారు ఆభరణాలు దోచుకున్న కేసు మరో మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో విజయవాడకు చెందిన రౌడీషీటర్‌ మాన మనోజ్‌ అలియాస్‌ మున్నా కీలక సూత్రధారిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎన్‌ఏడీ ప్రాంతం బుచ్చిరాజుపాలేనికి చెందిన కొణతాల రమేష్‌ (47) బ్లూ స్టాక్‌ బ్రోకింగ్‌ కంపెనీకి ఫ్రాంచైజీగా వ్యాపారం చేస్తున్నారు. ఇటీవల క్యూవీఎస్‌వీ యాప్‌లో పెట్టుబడి పెట్టగా నగదు బ్లాక్‌ అయింది. అన్‌బ్లాక్‌ చేసేందుకు డాలర్లు అవసరమవడంతో సహచరుడు డి.రమేష్‌కుమార్‌ను సంప్రదించాడు. అతడికి తెలిసిన రాజు ద్వారా డాలర్లు ఏర్పాటు చేస్తానని చెప్పడంతో ఈ నెల 25న వారితో పాటు కుటుంబ సభ్యులు నగరానికి వచ్చారు.

బ్యాంకు వద్ద దాడి

రాజు పంపిన లొకేషన్‌కు చేరుకోగా ఇద్దరు వ్యక్తులు కలిసి నగదు ముందే ఇవ్వాలని కోరారు. అనుమానం వచ్చిన రమేష్‌ అక్కడి నుంచి వెళ్లిపోగా.. రాజు ఫోన్‌ చేసి తానే లావాదేవీ పూర్తి చేస్తానని నమ్మించాడు. రాజు మాటలు నమ్మిన బాధితులు తమ లొకేషన్‌ పంపించారు. మళ్లీ అదే వ్యక్తులు వచ్చి నగదు లెక్కించేందుకు ద్వారకానగర్‌ 4వ లైన్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వద్దకు తీసుకెళ్లారు. అక్కడ మరికొందరు వారితో కలిసి కొణతాల రమేష్‌, డి.రమేష్‌కుమార్‌, వారి కుటుంబ సభ్యులపై దాడి చేసి కారును ధ్వంసం చేశారు. అనంతరం రూ.68 లక్షల నగదు, 10 తులాల బంగారం ఉన్న బ్యాగులను లాక్కెళ్లారు.

రౌడీషీటర్‌ కీలక సూత్రధారి?

సాంకేతిక ఆధారాలతో విజయవాడకు చెందిన రౌడీషీటర్‌ మాన మనోజ్‌ అలియాస్‌ మున్నా కీలక సూత్రధారిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అతడిపై 90కిపైగా కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. పీడీ యాక్ట్‌తో నగర బహిష్కరణకు గురైన అతడికి విశాఖలో హోంగార్డు కుమారుడు రాజు ఆశ్రయం కల్పించినట్లు సమాచారం. వీరిద్దరికీ సెంట్రల్‌ జైలులోనే పరిచయం ఏర్పడి, బయటకు వచ్చిన తర్వాత మోసానికి పథకం వేసుకున్నట్లు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది.

పోలీసుల అదుపులో నిందితులు?

ద్వారకానగర్‌ క్రైమ్‌ పోలీసులు మూడు ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. దోపిడీ వెనుక ఉన్న వారి వివరాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. నిందితుల నుంచి దోపిడీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కేసులో మరో కీలక నిందితుడు రాజు పరారీలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement