సీఐఎస్‌ఎఫ్ డీజీ ప్రవీర్ రంజన్
ఉక్కునగరం: ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది సవాళ్లను ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉండాలని సీఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ ప్రవీర్ రంజన్ అన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా ఆయన స్టీల్‌ప్లాంట్ సీఐఎస్‌ఎఫ్ యూనిట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఉక్కు ఎల్ అండ్ డీసీ ఆడిటోరియంలో నిర్వహించిన సైనిక్ సమ్మేళనంలో ఆయన సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇంతవరకు భూతలం, ఏరియల్, సైబర్ దాడులు జరిగేవని, ప్రస్తుతం డ్రోన్ దాడులు కొత్తగా ప్రారంభమయ్యాయని ఆయన అన్నారు. ఇటీవల సీఐఎస్‌ఎఫ్ మహిళా సిబ్బందిలో 30 మంది ఎన్‌ఎస్‌జి శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్నారని తెలిపారు. అందరికీ అవసరమైన శిక్షణ అందజేస్తామన్నారు. అంతకు ముందు హిల్‌టాప్ గెస్ట్‌హౌస్‌లో స్టీల్‌ప్లాంట్ సీఎండి ఎం.ఎన్.వి.ఎస్. ప్రభాకర్, డైరెక్టర్లను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో సీఐఎస్‌ఎఫ్ అడిషనల్ డీఐజి (ఎయిర్‌పోర్ట్స్) వినీత ఠాగూర్, సౌత్ ఐజీ శర్వానంద్, సౌత్ డీఐజి సంతోష్‌కుమార్ సింగ్, సీఐఎస్‌ఎఫ్ కమాండెంట్ దువ్వాడ జితేంద్ర బాబు, పలువురు అసిస్టెంట్ కమాండెంట్లు పాల్గొన్నారు.


