ఆర్థిక మదింపు పేరుతో
ప్రాజెక్టు వ్యయం పెంపు
రూ.5 వేల కోట్లు పెంచేసిన చంద్రబాబు సర్కారు
టెండర్లలో రూ.6,250 కోట్లు.. డీపీఆర్‌లో రూ.11,498 కోట్లు
గత ప్రభుత్వంలో 76 కి.మీ. ఫస్ట్ ఫేజ్‌కు రూ.9,669 కోట్లు
ఇప్పుడు 46 కిలోమీటర్లకే రూ.11,498 కోట్లు
విశాఖ మెట్రో లెక్కలపై వెల్లువెత్తుతున్న అనుమానాలు
పట్టాలెక్కక ముందే..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ మెట్రో ప్రాజెక్టు ఇంకా పట్టాలెక్కకముందే.. అంచనాల అంకెలు పరుగులు పెడుతున్నాయి. 46.23 కిలోమీటర్ల తొలి దశకు ప్రభుత్వం గతంలో రూ.6,250 కోట్లతో టెండర్లు పిలవగా.. అదే ప్రాజెక్టు వ్యయం ఇప్పుడు రూ.11,498 కోట్లకు చేరింది. అంటే టెండర్ అంచనాతో పోలిస్తే ఏకంగా రూ.5,248 కోట్లు పెరగడం గమనార్హం. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో 76 కిలోమీటర్ల తొలి దశకు రూ.9,669 కోట్లుగా అంచనా వేసిన నేపథ్యంలో.. ఇప్పుడు దూరం తగ్గినా వ్యయం పెరగడంపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక మదింపు తర్వాత సాధారణంగా వ్యయం తగ్గాల్సి ఉండగా.. విశాఖ మెట్రో విషయంలో మాత్రం అంచనాలు అమాంతం పెరగడం వెనుక కారణాలేమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వైఎస్సార్‌సీపీ హయాంలో ఇలా..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 140.13 కిలోమీటర్లను మూడు దశల్లో నిర్మించేలా రూ.14,309 కోట్లతో డీపీఆర్ రూపొందించి కేంద్రానికి పంపించారు. ఇందులో తొలి దశగా 76 కిలోమీటర్లకు రూ.9,669 కోట్ల అంచనా వ్యయం నిర్ధారించారు. కేంద్రం ఆమోదించే సమయంలో ప్రభుత్వం మారిపోయింది. చంద్రబాబు గద్దెనెక్కాక.. మళ్లీ డీపీఆర్‌లో మార్పులంటూ ఆలస్యం చేశారు. డబుల్ డెక్కర్ అంటూ కొత్త ప్రతిపాదనని పంపించారు. విశాఖలో డబుల్‌డెక్కర్ వయబుల్ కాదంటూ కేంద్రం అక్షింతలు వేసింది. దీంతో.. ఎంతో కొంత మేర డబుల్‌డెక్కర్ ఫ్లైఓవర్ ఉండాలని చంద్రబాబు పట్టుబట్టడంతో.. ప్రాజెక్టు ముందుకు కదలలేదు.
రూ.6,250 కోట్ల నుంచి రూ.11,498 కోట్లకు..
46.23 కిలోమీటర్ల తొలి దశ నిర్మాణానికి గతేడాది జూలైలో రూ.6,250 కోట్లతో (జీఎస్టీ అదనం) ఈపీసీ విధానంలో టెండర్లు పిలిచారు. అయితే సింగిల్‌గా కాకుండా ప్యాకేజీలుగా విభజించడం వంటి నిబంధనల కారణంగా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో టెండర్ ప్రక్రియ నిలిచిపోయింది. ఇదిలా ఉండగా.. కేంద్ర ఆర్థిక మదింపు కోసం పంపిన సవరించిన డీపీఆర్‌లో అదే 46.23 కిలోమీటర్లకు రూ.11,498 కోట్లుగా అంచనా వేయడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. టెండర్ అంచనాతో పోలిస్తే రూ.5,248 కోట్ల వ్యత్యాసం కనిపిస్తోంది. భూసేకరణ, డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు, కోచ్‌ల కొనుగోలు తదితర వ్యయాలను కలిపినా ఇంత భారీగా పెరిగే అవకాశం లేదని, ఇందులో ఏదో పెద్ద మాయాజాలమే ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి.
దూరం తగ్గినా.. వ్యయం పెరిగింది!
గత ప్రభుత్వంలో 76 కిలోమీటర్ల తొలి దశకు రూ.9,669 కోట్లుగా అంచనా వేయగా.. ప్రస్తుత ప్రతిపాదనలో దూరాన్ని 46.23 కిలోమీటర్లకు కుదించి వ్యయాన్ని మాత్రం రూ.11,498 కోట్లకు పెంచారు. తక్కువ దూరానికి ఎక్కువ వ్యయం ఎలా వచ్చిందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. సవరించిన డీపీఆర్‌లో అంచనాలు ఇంత భారీగా పెరగడానికి కారణాలు, టెండర్ డాక్యుమెంట్లలో లేని కొత్త పనుల వివరాలు, ప్రతి విభాగానికి సంబంధించిన వ్యయ బ్రేకప్ గోప్యంగా ఉంచుతుండటం గమనార్హం.


