అల్లిపురం: డిజిటల్ అరెస్ట్ పేరుతో జరిగిన సైబర్ మోసం కేసులో మ్యూల్ అకౌంట్‌గా బ్యాంక్ ఖాతాను అందించిన నిందితుడిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన 76 ఏళ్ల రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి, ఆయన భార్యను టెలికాం, పోలీస్, ఈడీ, సీబీఐ అధికారులమంటూ సైబర్ నేరగాళ్లు భయపెట్టారు. అక్రమంగా డబ్బులు సంపాదించారని, అరెస్ట్ చేస్తామని బెదిరించారు. ఆర్‌బీఐ ఫండ్ వెరిఫికేషన్ పేరుతో వారి జీవితకాల పొదుపు సొమ్ము నుంచి రూ.1,46,50,220ను వివిధ బ్యాంకు ఖాతా లకు బదిలీ చేయించుకున్నారు. అనంతరం మోసపోయినట్లు గ్రహించిన బాధితులు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ కె.భవానిప్రసాద్ పర్యవేక్షణలో కేసు నమోదు చేసి దర్యాపుపట్టారు. ఈ ఏడాది ఏప్రిల్ 16న బాధితుడి ఖాతా నుంచి రూ.29.20 లక్షలు బదిలీ అయిన ఖాతాను పోలీసులు పరిశీలించారు. కేవైసీ వివరాల ప్రకారం పీఎం షబీర్, అబూతాహీర్ జాయింట్ అకౌంట్ హోల్డర్లుగా ఉన్నారు. మొబైల్ నంబర్, ఇతర సాంకేతిక ఆధారాలతో షబీర్‌ను గుర్తించారు. విచారణలో తన బ్యాంక్ ఖాతా వివరాలు, ఏటీఎం కార్డు, సిమ్ కార్డును ఇతరులకు ఇచ్చినట్లు షబీర్ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అతని ఖాతా ద్వారా సుమారు రూ.92 లక్షల మేర లావాదేవీలు జరిగినట్లు వెల్లడైంది. ఈ మోసంతో సంబంధం ఉన్న మరికొందరు నిందితులు, వారి పాత్రపై కీలక సమాచారం లభించిందని, వారిని గుర్తించి తదుపరి చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.


