జీవీఎంసీలో కమిషనర్ ‘బదిలీ’ కథా చిత్రం
ప్రభుత్వ ఉత్తర్వులకే దిక్కులేదు!
ప్రిన్సిపల్ సెక్రటరీ జీవోలు బుట్టదాఖలు
సంచలనంగా సీఎంవోహెచ్ బది‘లీలలు’
పాత అధికారిపై వీడని ‘ప్రత్యేక’ మమకారం!
ప్రభుత్వ జీవోలకు విలువ లేదు. సీనియర్ ఐఏఎస్ అధికారి ఉత్తర్వులకు గౌరవం లేదు.
జీవీఎంసీలో సీఎంవోహెచ్ బదిలీ వ్యవహారం ‘గ్రేటర్’ పాలనా చరిత్రలోనే సంచలనంగా మారింది. ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి వెలువడిన బదిలీ ఆర్డర్లను సైతం తొక్కిపెట్టడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. గిరి ప్రదక్షిణ సాకుతో పాత అధికారికి తాత్కాలిక మినహాయింపు ఇచ్చారనుకున్నా.. ఆ కార్యక్రమం ముగిసి పక్షం రోజులు దాటుతున్నా.. ఇంకా సదరు అధికారిని అదే కుర్చీలో కులాసాగా కూర్చోబెట్టడం వెనుక ఉన్న అసలు రహస్యమేంటో? ఈ ‘షాడో’ పాలనకు బాధ్యులెవరో అన్న చర్చ జోరుగా సాగుతోంది.
డాబాగార్డెన్స్: మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)లో ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, మొండివైఖరి పరాకాష్టకు చేరాయి. జీవీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ (సీఎంవోహెచ్) బదిలీ వ్యవహారం సంస్థ హాట్ టాపిక్‌గా మారింది. గత నెలలో ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎంహెచ్‌వోల బదిలీలు చేపట్టారు. అందులో పార్వతీపురం మన్యం జిల్లా డీఎంహెచ్‌వోగా పనిచేస్తున్న డాక్టర్ ఎస్.భాస్కరరావును జీవీఎంసీ సీఎంవోహెచ్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఐదేళ్లుగా జీవీఎంసీ సీఎంవోహెచ్‌గా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ నరేష్‌కుమార్‌ను శ్రీకాకుళం డీఎంహెచ్‌వోగా బదిలీ చేశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం పార్వతీపురం మన్యం జిల్లా బాధ్యతల నుంచి రిలీవ్ అయిన డాక్టర్ భాస్కరరావు బాధ్యతలు స్వీకరించేందుకు విశాఖ రాగా.. ఆయనకు కమిషనర్ నుంచి చేదు అనుభవమే ఎదురైంది. ‘తర్వాత చూద్దాం.. ప్రస్తుతానికి జాయిన్ కానక్కర్లేదు’ అంటూ కమిషనర్ హుకుం జారీ చేశారు. దీంతో నూతన అధికారి బిత్తరపోవాల్సి వచ్చింది. ఇటు కొత్త పోస్టింగ్‌లో జాయిన్ కాలేక, అటు పాత స్థానం నుంచి రిలీవ్ అయిపోయి సదరు అధికారి గాల్లో ఉండిపోయారు.
గిరి ప్రదక్షిణ ముగిసినా వీడని ‘మమకారం’!
ఐదేళ్లుగా జీవీఎంసీ సీఎంవోహెచ్‌గా పనిచేస్తున్న డాక్టర్ నరేష్‌కుమార్‌ను బదిలీ చేస్తూ స్పష్టమైన ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఆయనను రిలీవ్ చేయకపోవడం వెనుక పెద్ద కథే నడుస్తోంది. గత నెల 28న జరిగిన గిరి ప్రదక్షిణ ఏర్పాట్ల సాకుతో ఆయనను ఇక్కడే ఉంచినట్లు ప్రచారం జరిగినప్పటికీ.. ఆ కార్యక్రమం ముగిసి పక్షం రోజులు కావస్తున్నా ఇంకా పాత సీట్లోనే కొనసాగించడం అనుమానాలకు తావిస్తోంది. ప్రిన్సిపల్ సెక్రటరీ జీవోలను సైతం పక్కనబెట్టి మరీ ఒకే అధికారిపై ఉన్నతాధికారి చూపుతున్న ఈ ‘ప్రత్యేక’ మమకారం వెనుక ఉన్న అసలు రహస్యమేమిటోనని కార్పొరేషన్ వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది.
ఒంట్లో బాగులేదు.. త్వరలోనే చేరతా!
జీవీఎంసీలో బాధ్యతల స్వీకరణలో ఎదురైన ఉదంతంపై డాక్టర్ భాస్కరరావును ‘సాక్షి’ వివరణ కోరగా.. తనకు ఒంట్లో బాగోలేదని, అందుకే జాయిన్ కాలేదని చెప్పారు. నాలుగు ఐదు రోజుల్లో బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పడం గమనార్హం. ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చి ఇన్ని రోజులవుతున్నా ఈ తీరుగా వ్యవహరించడం వెనుక ఒత్తిళ్లు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


