జూడాల సమ్మెతో.. రోగుల హాహాకారాలు | - | Sakshi
Sakshi News home page

జూడాల సమ్మెతో.. రోగుల హాహాకారాలు

Aug 18 2026 12:27 AM | Updated on Aug 18 2026 12:27 AM

సర్కారు ఆసుపత్రుల్లో

స్తంభించిన వైద్య సేవలు!

అత్యవసర వైద్య సేవలు బంద్‌

ఓపీ, వార్డుల్లో రోగుల పడిగాపులు

వైద్యుల అవతారమెత్తిన నర్సులు

ఏడు రోజులుగా జూడాలు సమ్మె చేస్తున్నా

పట్టించుకోని ప్రభుత్వం

మహారాణిపేట: వైద్యం కోసం వచ్చిన నిరుపేద రోగులకు తిప్పలు తప్పడం లేదు. స్టైఫండ్‌ పెంచాలని డిమాండ్‌ చేస్తూ జూనియర్‌ వైద్యులు చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో సోమవారం నుంచి వారు అత్యవసర సేవలను కూడా బహిష్కరించారు. గత ఏడు రోజులుగా కొనసాగుతున్న ఈ సమ్మెతో ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్‌ సహా నగరంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి.

వెలవెలబోయిన ఓపీలు

జూనియర్‌ వైద్యులు, పీజీ విద్యార్థులు విధులకు గైర్హాజరు కావడంతో ఓపీ విభాగాలు వెలవెలబోయాయి. కేజీహెచ్‌లోని 26 ఓపీ విభాగాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. నిత్యం వేలాది మంది రోగులను చూసే జూడాలు లేకపోవడంతో వైద్యం కోసం వచ్చిన వారు గంటల తరబడి పడిగాపులు కాశారు. అత్యవసరం కాని శస్త్రచికిత్సలన్నింటినీ అధికారులు వాయిదా వేశారు. కేజీహెచ్‌తో పాటు విక్టోరియా, ప్రాంతీయ కంటి ఆసుపత్రి, ప్రభుత్వ మానసిక ఆసుపత్రి, రాణీ చంద్రమణి దేవి, ఈఎన్‌టీ, టీబీ ఆసుపత్రుల్లోనూ రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వైద్యుల అవతారంలో నర్సులు

ఇన్‌పేషెంట్‌ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. సమయానికి వైద్యులు రాకపోవడంతో రోగులు నరకయాతన అనుభవించారు. సరైన వైద్యం అందక బాధితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని విభాగాల్లో గత్యంతరం లేక నర్సులు, నాలుగో తరగతి సిబ్బందే వైద్యుల అవతారమెత్తి రోగులకు ప్రాథమిక చికిత్సలు అందించాల్సిన దుస్థితి ఏర్పడింది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు ఆసుపత్రి ప్రాంగణాల్లోనే నిస్సహాయంగా ఎదురుచూస్తూ కనిపించారు.

ప్రత్యామ్నాయాలతో కలగని ఉపశమనం

జూడాల సమ్మె నేపథ్యంలో ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రశేఖర నాయుడు, ఏఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంధ్యాదేవి అత్యవసర చర్యలు చేపట్టారు. వైద్యుల సెలవులన్నింటినీ రద్దు చేశారు. డీఎంహెచ్‌వో పరిధిలోని 8 మంది వైద్యులతో పాటు నాన్‌ క్లినికల్‌ విభాగాలకు చెందిన 47 మంది వైద్యులను విధుల్లోకి తీసుకున్నారు. ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్లను కూడా అత్యవసర వార్డుల్లో నియమించారు. మొత్తం 55 మంది వైద్యులతో మూడు షిఫ్టుల్లో రోస్టర్‌ విధానం అమలు చేస్తూ ఐసీయూ, క్యాజువాలిటీ, ఆపరేషన్‌ థియేటర్లలో సేవలు కొనసాగేలా చూస్తున్నామని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే గత ఏడు రోజులుగా జూనియర్‌ వైద్యులు సమ్మె చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోయినా పట్టనట్లు వ్యవహరిస్తుండటం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

డిమాండ్లు పరిష్కరించకుంటే పోరాటం ఉధృతం

న్యాయమైన డిమాండ్ల సాధన కోసమే తాము సమ్మె బాట పట్టామని ఆంధ్రప్రదేశ్‌ జూనియర్‌ డాక్టర్ల అసోసియేషన్‌ (ఏపీ జూడా) నేతలు స్పష్టం చేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని యూనియన్‌ నాయకులు దినకర్‌ సాయి శ్రీనివాస్‌, కె.రవీంద్ర, డాక్టర్‌ సిరాజ్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే దశలవారీగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement