ఆనందపురం: మండలంలోని పాలవలస పంచాయతీ గుడిలోవ విజ్ఞాన విహార్ పాఠశాల ఆవరణలో ఆర్‌ఎస్‌ఎస్ అఖిలభారత సమన్వయ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబళే హాజరయ్యారు. వీరితోపాటు దేశవ్యాప్తంగా ఆర్‌ఎస్‌ఎస్ ముఖ్య నాయకులు, వివిధ విభాగాల ప్రతినిధులు తరలిరావడంతో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. వారం రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో సమకాలీన అంశాలు, సంఘ కార్యకలాపాలు, వివిధ విభాగాల పురోగతిపై విస్తృతంగా చర్చించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.


