ముగిసిన మూడు రోజుల వరుణ జపాలు
సింహాచలం: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ సింహగిరి క్షేత్రపాలకుడు త్రిపురాంతకస్వామి ఆలయంలో మూడు రోజులుగా నిర్వహించిన వరుణ జపాలు శనివారం ఘనంగా ముగిశాయి. ముగింపు సందర్భంగా స్వామివారికి వైభవంగా సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. ఉదయం ఏకాదశ రుద్రాభిషేకంతో పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం గంగధార వద్ద నుంచి 1,001 కలశాల్లో తీసుకువచ్చిన పవిత్ర జలాలతో త్రిపురాంతకస్వామికి సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. అనంతరం వరుణ జపాలు, తర్పణాలు, నిత్య హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితులు కాళ్లకూరి సుబ్రహ్మణ్యేశ్వరశర్మ, అర్చకుడు రమణమూర్తి, వేద విద్యార్థులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.


