తలకిందులుగా చూపించినా చెప్తానంటోంది..
ఈ బుడత కళ్లలో ప్రపంచ పటం
ఇంటర్నేషనల్ స్టార్ కిడ్ అవార్డు సొంతం చేసుకున్న నగర చిన్నారి
జాన్య శివానిని అభినందించినకలెక్టర్ అభిషిక్త్ కిషోర్
డాబాగార్డెన్స్: విశాఖకు చెందిన రెండున్నరేళ్ల చిన్నారి జాన్య శివాని అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన ఘనత సాధించింది. ఇంటర్నేషనల్ స్టార్ కిడ్–2026 అవార్డును కైవసం చేసుకుని ప్రతిభ చాటింది. ప్రపంచంలోని 32 దేశాలకు చెందిన చిన్నారులతో జరిగిన పోటీల్లో జాన్య శివాని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తొలి స్థానం సాధించింది. ఇంటెలిజెన్స్ అండ్ మెమోరీ (ఐక్యూ) విభాగంలో ఈ అవార్డును అందుకుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ చిన్నారిని అభినందించారు.
గుర్తింపు ఇలా..
జాన్య శివాని ప్రపంచంలోని 195 దేశాల జాతీయ జెండాలను సులభంగా గుర్తించగలదు. జెండాలను తలకిందులుగా చూపించినా వెంటనే చెప్పగలదు. అలాగే 60 చారిత్రక కట్టడాలు, 55 మంది జాతీయ నాయకులు, సౌర కుటుంబం, పండ్లు, కూరగాయలు, శాస్త్రవేత్తల ఆవిష్కరణలను గుర్తించి చెప్పగల ప్రతిభను కనబరిచింది.
ఇప్పటికే పలు అవార్డులు
జాన్య శివాని గతంలో యంగ్ అచీవర్స్ ఒలింపియాడ్–2025లో తొలి బహుమతి, ఇంటర్నేషనల్ కిడ్స్ ఐకాన్ అవార్డు–2025ను కూడా అందుకుంది. చిన్న వయస్సులోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.


