పోక్సో కోర్టు మాజీ పీపీ కరణం కృష్ణ
సాక్షి, విశాఖపట్నం: దిశ చట్టాన్ని రద్దు చేయాలన్న రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం మహిళల భద్రత పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పోక్సో జిల్లా కోర్టు మాజీ పీపీ కరణం కృష్ణ విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మహిళలకు త్వరితగతిన న్యాయం అందించాలనే ఉద్దేశంతో దిశ చట్టాన్ని తీసుకొచ్చి, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ యాప్ వంటి వ్యవస్థలను ఏర్పాటు చేసిందన్నారు. చట్టానికి కేంద్రం ఆమోదం తీసుకొచ్చే ప్రయత్నం చేయాల్సింది పోయి, దానినే రద్దు చేయడం వల్ల మహిళల్లో భయాందోళనలు పెరుగుతాయని అన్నారు. దిశ చట్టం ద్వారా మహిళలపై జరిగే లైంగిక నేరాల కేసుల్లో వేగవంతమైన విచారణ, నిందితులకు త్వరగా శిక్ష పడేలా వ్యవస్థను రూపొందించారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక దిశ పోలీస్ స్టేషన్లు, మహిళా పోలీసుల నియామకం వంటి చర్యలు మహిళల భద్రతకు ఎంతగానో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. ప్రభుత్వం దిశ చట్టం రద్దు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఆయన కోరారు.


