మల్కాపురం: పారిశ్రామిక ప్రాంత పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎక్స్‌సర్వీస్‌మెన్ కాలనీలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. మల్కాపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 60వ వార్డు పరిధిలోని ఎక్స్‌సర్వీస్‌మెన్ కాలనీలో మనీష్‌కుమార్ తన భార్య సాధన, ఇద్దరు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. మనీష్‌కుమార్ షిప్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం ఆయన సమీపంలో నివసించే స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి తిరిగి వచ్చి తలుపు తట్టినా లోపల నుంచి స్పందన రాకపోవడంతో అనుమానం వచ్చి కిటికీ నుంచి చూడగా, భార్య సాధన గదిలోని ఫ్యాన్ హుక్‌కు వైర్‌తో ఉరివేసుకుని కనిపించింది. వెంటనే తలుపులు బలవంతంగా తెరిచి ఆమెను కిందకు దించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న మల్కాపురం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


